ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని రెడీ అయిపోయారు. ఇది కాదు విశేషం. సెన్సార్ బోర్డు నుంచి మ్యూట్లు, కత్తిరింపులు, మార్పులు మొత్తం కలిపి 21 ఐటమ్స్ ఉండటం అభిమానులను షాక్ కి గురి చేస్తోంది. వీటిలో పూర్తిగా తొలగించిన 25 సెకండ్ల ఫుటేజ్ కూడా ఉంది. అంటే ఓదెల చూపించే మాస్ ఫీస్ట్ అంచనాలకు మించి ఉండబోతుంది.
మాములుగా నాని సినిమాల్లో ఇన్ని కోతలు గతంలో చూసి ఎరగం. హిట్ 3, దసరాకు కూడా కొన్ని కట్స్ చెప్పారు కానీ మరీ ఈ స్థాయిలో కాదు. ఈ లెక్కన శ్రీకాంత్ ఓదెల ఆవిష్కరించే మాస్ కు హద్దులు ఉండేలా కనిపించడం లేదు. ఆల్రెడీ బుకింగ్స్ ఊపు మీద ఉన్నాయి. ట్రైలర్ లేకుండా, కేవలం రెండు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తూ ప్యారడైజ్ చూసిన ఒత్తిడి అంతా ఇంతా కాదనేది వాస్తవం.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్యారడైజ్ మొదటి నుంచి చివరి దాకా ఇంటెన్స్ డ్రామాగా ఉంటుంది. ఎంటర్ టైన్మెంట్ మోతాదు తక్కువే అయినా స్క్రీన్ ప్లేలో చేసే మేజిక్ తో ఓదెల మెప్పిస్తాడని రషెస్ చూసిన వర్గాల సమాచారం. ముఖ్యంగా జైలు ఫైట్, జడలతో రౌడీల తుక్కురేగొట్టే ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి దాకా ఊహించని స్థాయిలో సర్ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. కంటెంట్ క్లిక్ అయితే మటుకు నాని నేరుగా టయర్ వన్ లిస్టులోకి వెళ్లిపోవడం ఖాయమని టాక్.
ఇదంతా ఎలా ఉన్నా ఇంకొన్ని గంటల్లో పడబోతున్న ప్రీమియర్ల కోసం న్యాచురల్ స్టార్ అభిమానులే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని మాస్ అవతారం, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మోహన్ బాబు విలనిజం, రాఘవ్ జుయెల్ పాత్ర, సంపూర్ణేష్ డిఫరెంట్ క్యారెక్టర్ వెరసి ప్యారడైజ్ ఇవ్వబోయే మీల్స్ మాములుగా అయితే ఉండవు. హిట్ టాక్ వస్తే చాలు ఆదర్శ కుటుంబం వచ్చే దాకా నాని సింగల్ బ్యాట్స్ మెన్ గా సిక్సులు కొట్టడమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates