మైసా… చావు కబురు చల్లగా చెప్పారు

గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమే అని తేలిపోయింది. టాలీవుడ్లో మరో పేరున్న సినిమా వాయిదా పడిపోయింది. ఈ నెల 27కు షెడ్యూల్ అయిన చిత్రాల్లో ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ‘హైందవ’ వాయిదా పడగా.. ఇప్పుడు అదే వీకెండ్‌లో రావాల్సిన రష్మిక మందన్నా చిత్రం ‘మైసా’ కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని, ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ‘మైసా’ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రమాణాలు అంతకంతకూ పెరుగుతున్నాయని.. ఈ వారం విడుదలైన సినిమాలు కూడా సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాయని.. మైసా కూడా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ ఉన్న సినిమా అని, ఇందులో ప్రపంచ స్థాయి యాక్షన్ ఘట్టాలు ఉన్నాయని.. బిగ్ స్క్రీన్ ఆడియన్స్‌కు బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలన్న లక్ష్యంతో తాము ఈ సినిమాను రూపొందించామని.. అలాంటపుడు క్వాలిటీ విషయంలో ఎంతమాత్రం రాజీపడకుండా బెస్ట్ ప్రాడక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తమ టీమంతా ఉమ్మడిగా సినిమాను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ‘మైసా’ మేకర్స్ ప్రకటించారు.

త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని.. అంత వరకు ఓపికతో ఉండి తమకు సహకరించాలని కోరారు. ‘హైందవ’తో పాటు ‘మైసా’ కూడా వాయిదా పడడం ‘భోగి’కి వరం లాంటిదే. ఆ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడి నవంబరు 27కు షెడ్యూల్ అయింది. దీనికి పోటీగా ‘హై’తో పాటు కొన్ని చిన్న సినిమాలు వస్తున్నప్పటికీ.. ‘భోగి’ దాదాపు సోలోగా రిలీజవుతున్నట్లే. మరి ఈ అవకాశాన్ని శర్వా అండ్ టీం ఎంతమేర ఉపయోగించుకుంటుందో చూడాలి.