సుడిగాలి సుధీర్‌పై 15 కోట్లా?

‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి సుధీర్. అతను చేసే వేరే షోలు కూడా బాగానే పాపులర్ అయ్యాయి. బుల్లితెరపై అతడిని సూపర్ స్టార్ అనొచ్చు. ఐతే ఈ ఫాలోయింగ్ చూసి వెండితెర మీదా వెలిగిపోవాలని అతను చాలా ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాడు. హీరోగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘గాలోడు’ లాంటి చిత్రాల్లో నటించాడు. కానీ అవేవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయినా సుధీర్ తన ప్రయత్నాలను ఆపలేదు.

కొన్నేళ్ల ముందు ‘గోట్’ అనే సినిమాను సుధీర్ మొదలుపెడితే.. అది కొన్ని కారణాల వల్ల ఎంతకీ పూర్తి కాలేదు. మొదట ‘పాగల్’ మూవీ డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రాన్ని.. మధ్యలో వేదవ్యాస్ వేరే డైరెక్టర్ టేకప్ చేశాడు. అయినా సినిమా ఎంతకీ బయటికి రాలేకపోవడం, సుధీర్ సైతం ఈ చిత్రాన్ని పక్కన పెట్టేయడంతో ఇది ఇక రిలీజ్ కాదనుకున్నారు. కానీ నిర్మాత గట్టిగా ట్రై చేసి ఇటీవలే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకోగలిగాడు.

కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపించకుండానే మాయమైపోయింది. ఐతే ‘గోట్’ రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తున్న నిర్మాత చంద్రశేఖర్.. ఈ సినిమా గురించి సంచలన విషయం చెప్పాడు. ఈ చిత్రానికి వడ్డీలు కాకుండా రూ.14.5 కోట్ల బడ్జెట్ అయిందని ఆయన వెల్లడించడం గమనార్హం. ఇంట్రెస్ట్స్ కూడా కలిపితే ఖర్చు ఇంకెంత అయిందో మరి. ఈ సినిమా వల్ల తాను దారుణంగా నష్టపోయినట్లు చంద్రశేఖర్ తెలిపాడు.

ముందు మూడున్నర కోట్ల బడ్జెట్లో సినిమా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని రంగంలోకి దిగామని, ఐతే ఒక 25 శాతం ఖర్చు పెరగడం ఏ సినిమాకైనా కామనే అని.. కానీ ప్రొఫెషనలిజం లేని, ఫిలిం మేకింగ్ తెలియని దర్శకుడిని పెట్టుకుని సినిమా మొదలుపెట్టడం.. అవినీతి జరగడం, కమీషన్ల వల్ల సినిమా బడ్జెట్ అదుపు తప్పిందని, దర్శకుడిని మార్చినప్పటికీ బడ్జెట్ అదుపు చేయలేకపోయామని.. సినిమాలో కొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని.. దీంతో బడ్జెట్ ఎక్కడికో వెళ్లిపోయిందని ఈ నిర్మాత తెలిపాడు.

సినిమా బడ్జెట్ పెరుగుతుంటే.. తన మీద ఇంత ఖర్చా అని సుధీర్ కొంచెం కంగారు పడ్డాడని, కానీ అతను కూడా తనకు పెద్దగా సహకరించలేదని, ఆదుకోలేదని.. హీరో లేకుండా సినిమాలో 60 శాతం దాకా షూట్ చేశామని చంద్రశేఖర్ చెప్పాడు.