ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్ ఉంది కానీ సోలో హీరోగా మార్కెట్ ఎప్పుడో తగ్గిపోయిన నేపథ్యంలో నిర్మాతలెవరూ సినిమాలు తీసేందుకు ముందుకు రావడం లేదు. అప్పుడప్పుడు కొడుకు సినిమాల్లో కనిపించడం తప్ప యాక్టింగ్ దాదాపుగా తగ్గించారు. ఫలితం పక్కనపెడితే తనలో పస తగ్గలేదని కన్నప్పలో అయితే ఋజువు చేశారు. కానీ శ్రీనివాస మంగాపురంలో ఫ్యాక్షనిస్ట్ పాత్ర తీవ్ర నిరాశని మిగిల్చింది.
ఇదంతా ఏమో కానీ రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న ప్యారడైజ్ లో మోహన్ బాబే మెయిన్ విలన్. రాఘవ్ జుయెల్ ఉన్నాడు కానీ స్కోప్ పరంగా చూసుకుంటే ఇతని డామినేషన్ తక్కువగానే ఉంటుందట. అంటే నానిని, తనను నమ్ముకున్న జాతికి నరకం చూపించే శిఖంజి మాలిక్ క్యారెక్టర్ లో మోహన్ బాబు విశ్వరూపం ఉంటుందని ఇన్ సైడ్ టాక్. తిరుపతి యూనివర్సిటీ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ప్యారడైజ్ చూశాక నా దగ్గరికి రావడానికి భయపడతారని చెప్పడం దీనికి నిదర్శనం.
మరి ఇంత ప్రాధాన్యం ఉన్న సినిమా ప్రమోషన్లకు మోహన్ బాబు ఎందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. శ్రీనివాస మంగాపురం వేడుకకు టీం పిలిచినా నో అన్నారట. కానీ ప్యారెడైజ్ వెనుక కారణముందని అంతర్గతంగా వినిపిస్తోంది. ఆరు వందలకు పైగా సినిమాల అనుభవంలో మోహన్ బాబు మునుపెన్నడూ చేయని హింసాత్మక పాత్ర ప్యారడైజ్ లో చేశారని, దాని ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం బయటికి చెప్పట్లేదట.
హిట్టయ్యాక పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీలో భాగమవుతారేమో చెప్పలేం కానీ ప్రస్తుతానికి మాత్రం తనను తాను హైలైట్ చేసుకోకుండా మోహన్ బాబు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు. వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో తెలుగు తెరపై ఏ సీనియర్ స్టార్ హీరో చేయని షాకింగ్ ఎపిసోడ్స్ ఇందులో మోహన్ బాబు మీద ఉన్నాయి. అవి పేలితే మటుకు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అవ్వొచ్చు. అందుకే నాని ధీమాగా తన ఇంటర్వ్యూలలో మోహన్ బాబుకి ఓ రేంజ్ ఎలివేషన్లు ఇస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates