ప్యారడైజ్ కథా నేపథ్యం తెలుసా?

ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ది ప్యారడైజ్’ మూవీ. ముందు రోజు సాయంత్రమే పెయిడ్ ప్రిమియర్స్ కూడా పడుతున్నాయి. మొదలైన దగ్గర్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం మీద. ఫస్ట్ గ్లింప్స్‌తోనే సినిమా మీద క్యూరియాసిటీ పెంచేశాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తర్వాత వచ్చిన ప్రతి పోస్టర్, ప్రోమో అంచనాలను పెంచుతూనే పోయాయి.

తొలి చిత్రం ‘దసరా’తోనే ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి కూడా ఇంకో వరల్డ్‌లోకి ప్రేక్షకులతో అడుగు వేయించబోతున్నాడు. ఇంతకీ ఇందులో శ్రీకాంత్ చెప్పబోయే కథకు సంబంధించిన నేపథ్యమేంటో ఒకసారి చూద్దాం పదండి.

ఇండియాకు స్వాతంత్ర్యం రావడానికి పూర్వం.. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన షికారి అనే సంచార జాతి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో స్థిరపడింది. వీళ్లది బేసిగ్గా హింసా ప్రవృత్తి. వేట, దొంగతనాలు వీరి వృత్తులు. బేసిగ్గా హిందూ ఆచారాలను పాటిస్తూ దేవుళ్లను పూజించే వీరిని.. నిజాం పాలకులు ఇక్కడి నుంచి తరిమేశారు. ఈ కుటుంబాలు వేర్వేరుగా ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. వీరికంటూ ఏ గుర్తింపూ లేదు. కులం లేదు. ఓటు హక్కు లేదు.

ఏ ప్రభుత్వాలూ వీరిని గుర్తించలేదు. చాలా ఏళ్లు దొంగతనాలు చేసుకుంటూనే బతికిన వీరికి ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో కాస్త గుర్తింపు వచ్చింది. రేషన్ కార్డులివ్వడంతో పాటు బీసీలుగా గుర్తించే ప్రయత్నం జరిగింది. ఆ టైంలోనే దొంగతనాల నుంచి నాటు సారా వైపు ఈ సంచార జాతి మళ్లింది. కానీ ఇక్కడే ప్రభుత్వ సారా దుకాణాలను నడిపించే రాజకీయ నాయకులతో వీరికి ఘర్షణ మొదలవడం.. వీరిపై అఘాయిత్యాలు జరగడంతో తిరుగుబాటు మొదలైంది.

ఈ సంచార జాతిని నడిపించే నాయకుడి కథే ‘ది ప్యారడైజ్’లో చూడబోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ‘పుష్ప’, ‘పెద్ది’ సినిమాలను మిక్స్ చేసినట్లుగా ఈ కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’లో హీరో ఇంటిపేరు కోసం పోరాడతాడు. ‘పెద్ది’లో కథానాయకుడు తన ఊరికి గుర్తింపు కోసం తపిస్తాడు. ‘ది ప్యారడైజ్’లో హీరో తన జాతి మొత్తానికి ఐడెంటిటీ కోసం కొట్లాడతాడు.

‘ది ప్యారడైజ్’ టీం.. ఏపీ, తెలంగాణల్లో అక్కడక్కడా ఉన్న ఈ షికారి జాతిని కలిసి రీసెర్చ్ చేసి కథ తయారు చేసింది. ప్రస్తుతం ఏపీలోని కర్నూలులో ఈ షికారిలు ఎక్కువమంది ఉన్నారు. వారికి అక్కడ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు కూడా ఉంది. ‘ప్యారడైజ్’ టీం తమ దగ్గర సమాచారం తీసుకుందని, తర్వాత పట్టించుకోలేదని.. తనకు సినిమాలో పాత్ర ఇస్తానని ఇవ్వలేదని కర్నూలుకు చెందిన షికారి నాయకుడు ఒకరు ఈ టీం మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఐతే రిలీజ్ తర్వాత మరింత ఇబ్బందులు రాకుండా.. ఈ కథా నేపథ్యాన్ని ఆదిలాబాద్‌కు మార్చి, షికారిలను సవారిలుగా మార్చి, ఒక కల్పిత కథలా దీన్ని తెరపై ప్రెజెంట్ చేయబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల.