మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్ మీద సోషల్ మీడియా డిస్కషన్స్ చాలానే జరిగాయి. రంగు కారణంగా సుహాస్ వివక్షకు గురయ్యాడని, అయితే తమిళనాడు ప్రజలు నలుపుని ప్రేమిస్తారని, ఆ రేసిస్ట్ కామెంట్స్ చేసినవాళ్లకు ఇదే నా సమాధానం అంటూ సినిమా స్టైల్ లో స్పీచ్ ఇచ్చాడు సదరు దర్శకుడు. సుహాస్ సైతం అంగీకారంగా తలుపుతూ థాంక్స్ చెప్పడం వివాదానికి దారి తీసింది.

డ్యామేజ్ గుర్తించిన సుహాస్ ఉదయం ఒక నోట్ వదిలాడు. యూట్యూబ్ నుంచి ఇక్కడి దాకా రావడానికి తనను ఆదరించిన ప్రేక్షకులకు ఎప్పుడూ ఋణపడి ఉంటానని మూడు పేరాలు పొందుపరిచాడు. అంతా బాగానే ఉంది కానీ ఆ వివరణలో ఎక్కడా టాలీవుడ్, తెలుగు అనే పదాలు పొరపాటున కూడా దొర్లలేదు. మళ్ళీ ఎక్కడ కోలీవుడ్ జనాలు ఫీలవుతారని అనుకున్నాడో, లేక చేతిలో ఉన్న తమిళ ఆఫర్లకు చిక్కు వస్తుందని ఆలోచించాడో ఏమో కానీ మొహమాటం అయితే కనిపించింది.

కెరీర్ ఎదుగుతున్న టైంలో ఇలాంటి టెన్షన్లు ఉండటం సహజమే కానీ మరీ ప్రతి విషయంలో ఇంత జాగ్రత్త అవసరం లేదు. నిన్నేదో ఫ్లోలో అలా జరిగిపోయింది, నన్ను ఎవరు టాలీవుడ్ లో రంగు ఆధారంగా వివక్ష చూపలేదని చెప్పి ఉంటే సరిపోయేది. లేదా సదరు దర్శకుడి కామెంట్స్ వ్యక్తిగతం నాకు సంబంధం లేదని అన్నా ఇంకోలా జనం అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. కానీ డిప్లోమాటిక్ గా ఉండాలన్న ఉద్దేశంతో సుహాస్ తీసుకున్న ఎత్తుగడ ఆశించిన ఫలితం ఇవ్వదేమో.

ఏదైతేనేం సుహాస్ తెలుగు తమిళంలో బిజీ కావాలనేది సగటు మూవీ లవర్స్ కోరిక. నిజంగానే కలర్ ఆధారంగా చేసుకుని సినిమాలు చూసే అలవాటు ఆడియన్స్ కైతే లేదు. విజయ్ కాంత్ కెప్టెన్ ప్రభాకర్, మురళి హృదయం లాంటివి మన దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యాయంటే దానికి కారణం భాషా భేదాలు లేని మన జనాల సినిమా ప్రేమ. పరిశ్రమలో ఒకరో ఇద్దరో అని ఉండొచ్చేమో కానీ ప్రేక్షకులైతే అభిమానం చూపించారుగా. సుహాస్ భవిష్యత్తులో అయినా దీనికి సమాధానం చెప్పే అవసరం రావొచ్చు.