ఇది తప్పు కదా సుహాస్!

నిన్న చెన్నైలో జరిగిన మండాడి సక్సెస్ మీట్ లో సుహాస్ ని ఉద్దేశించి దర్శకుడు మతిమారన్ పుగళేంది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్వంత చోట సుహాస్ కు రంగు వల్ల వివక్ష వచ్చిందని, కానీ తమిళనాడు ప్రేక్షకులకు నలుపు అంటే ఇష్టమని, ఇక్కడ సట్టపులి పాత్రని బాగా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పడం పెద్ద డిస్కషన్ కు దారి తీసింది. ఇదంతా వింటున్న సుహాస్ వారించడం కానీ, ఖండించడం కానీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

వాస్తవానికి టాలీవుడ్ లో ట్రోలింగ్ బారిన పడని అతి కొద్ది మంది హీరోల్లో సుహాస్ ఒకడు. శరీరం రంగు ఏదైనా ఇక్కడ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. కలర్ ఫోటో నుంచి హే బలవంత్ దాకా సంవత్సరానికి కనీసం మూడు రిలీజులు ఉంటున్నాయి. కాకపోతే కంటెంట్లు బాగా లేకపోవడం వల్ల కొన్ని ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ రైటర్ పద్మభూషణ్ లాంటివి ప్రశంసలు, డబ్బులు రెండూ తెచ్చాయి. కళాకారుడు అనే షార్ట్ ఫిలిం నుంచి సుహాస్ కున్న ఆన్ లైన్ ఫాలోయింగ్ పెద్దదే.

ఇదంతా మర్చిపోయి సుహాస్ ఇంత తేలిగ్గా మతిమరన్ ప్రసంగాన్ని అంగీకరించడం లాంటి సంకేతాలివ్వడం లేనిపోని అపార్థాలకు దారి తీస్తోంది. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే టాలీవుడ్ లో ముందు నుంచి గ్లామర్ హీరోలదే కొంచెం ఎక్కువ ఆధిపత్యం ఉంటోంది. తమిళంలో విజయ్ కాంత్, మురళి లాగా పూర్తి నలుపు ఉన్న స్టార్లు మన దగ్గర తక్కువ. బాలీవుడ్ లో అయితే అసలే కనిపించరు. అంత మాత్రాన సుహాస్ మీద పెట్టుబడి పెడుతున్న నిర్మాతలకు ఏ రోజూ కొదవ లేదు.

ఎక్కడిదాకా వెళ్తుందో కానీ సుహాస్ దీనికి స్పందించాల్సి వచ్చేలా ఉంది. ఏ భాషతో పోల్చినా తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ ముందు ఎవరూ సాటిరారు. అంతెందుకు స్ట్రెయిట్ మూవీ ఎపిక్ ని తిరస్కరించి మండాడికి పట్టం ఎందుకు కట్టారు. సుహాస్ ఉన్నాడని ప్లస్ సినిమాలో విషయం ఉందని. లేదంటే సర్దార్ 2 లాగా మొదటి ఆటకే చేతులు ఎత్తేసేది. తమిళనాడులో మన సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదేమో కానీ తెలుగు ఆడియన్స్ అన్ని భాషల సినిమాలను ప్రేమిస్తారు, ప్రేమిస్తూనే ఉంటారు.