వాయిదాల పుకార్లు ఎన్ని తిరుగుతున్నా మా పని మాదే అన్న తరహాలో దసరా విడుదలని టార్గెట్ చేసుకున్న రెండు ప్యాన్ ఇండియా సినిమాలు తమ పనులు తాము చేసుకుంటున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీవ్ కుమార్ కలయికలో రూపొందుతున్న ‘జైలర్ 2’ అక్టోబర్ 15 రావడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని నిర్మాణ వర్గాలు చెబుతుండగా/ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటి నుంచి ఉంటుందనే సమాచారం ఇంకా ఇవ్వకపోవడం డౌట్లు తెప్పిస్తోంది.
ఒకవేళ పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే మళ్ళీ ఏ నవంబర్ లేదా డిసెంబర్ కో వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి అవసరం రాకుండా సన్ పిక్చర్స్ టీమ్ పగలు రాత్రి కష్టపడుతోంది. బిజినెస్ డీల్స్ ఇంకా కొలిక్కి రావడం లేదని టాక్. అడుగుతున్న రేట్లకు బయ్యర్లు ఆఫర్ చేస్తున్న దానికి వ్యత్యాసం ఉండటం వల్లే పెండింగ్ లో ఉన్నట్టు తెలిసింది. దీని తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటల గ్యాప్ లో అక్టోబర్ 16 విజయ్ దేవరకొండ రణబాలికి నిర్మాతలు కౌంట్ డౌన్ పోస్టర్లు వదులుతున్నారు.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడిక్ డ్రామాకు నిన్నే గుమ్మడికాయ కొట్టారు. ఇప్పటిదాకా జరిగిన షూటింగ్ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ క్రమం తప్పకుండా చేసుకుంటూ వచ్చారు. విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువ బాలన్స్ లేవట. ఇంకో నెల రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి అక్టోబర్ మొదటి వారంకల్లా సెన్సార్ పూర్తి చేయించి ఆపై నాన్ స్టాప్ గా ప్రమోషన్లకు ప్లాన్ చేసుకునేలా విజయ్ దేవరకొండ, రష్మిక బృందాలు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.
స్టార్ ఇమేజ్, మార్కెట్ లెక్కల్లో చూసుకుంటే ఇది జూనియర్ వర్సెస్ సీనియర్ క్లాష్ గా చెప్పుకోవచ్చు. ఎవరు పైచేయి సాధిస్తారేనేది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. జైలర్ 2 కి అడ్వాంటేజ్ ఏంటంటే సీక్వెల్ కున్న క్రేజ్ ప్లస్ అనిరుధ్ రవిచందర్. రణబాలికి అలాంటివి లేవు. అయినా కథా నేపథ్యం, భారీగా పెట్టిన ఖర్చు, ఇంతకు ముందు చూడని గెటప్ లో విజయ్ దేవరకొండ వెరసి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పై సినీ ప్రియులు గట్టి నమ్మకం పెట్టుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates