500 కోట్ల.. శ్రీదేవి ఆస్తి వివాదం.. చివ‌ర‌కు ఏమైదంటే!

ఆలిండియా నెంబ‌ర్ 1 హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న‌టి శ్రీదేవికి చెందిన భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. సినీ రంగంలో మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో శ్రీదేవి 1988లో చెన్నైలోని ఈస్టు కోస్టు రోడ్డు(ర‌ద్దీ ప్రాంతం) దాదాపు 5 ఎక‌రాల స్థ‌లాన్ని అప్ప‌ట్లో 4 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేశార‌ని కుటుంబం చెబుతోంది. ఇప్పుడు ఆ భూమి ధ‌ర ఎక‌రారూ.100 కోట్ల‌కు పైగానే ఉంది. అంటే.. సుమారు ఐదు కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఆ భూమి విలువ ప‌లుకుతోంది. అయితే.. ఇది వివాదంలో చిక్కుకుంది.

ఏంటా వివాదం.. ?

శ్రీదేవి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో న‌టుడు శోభ‌న్‌బాబు సూచ‌న‌ల మేర‌కు.. చెన్నైలో ప‌లు ఆస్తులు కొనుగోలు చేశారు. ఈ క్ర‌మంలోనే మొదిలియార్ అనే వ్యాపార వేత్త‌కు చెందిన భూమిని ఆమె కొన్నారు. స‌ర్వ హ‌క్కుల‌తో ఆయ‌న ఈ భూమిని విక్ర‌యించారు. ఇక‌, అక్క‌డి నుంచి శ్రీదేవి మృతి చెందే వ‌ర‌కు అంటే.. 2023వ‌ర‌కు కూడా ఈభూమి ఆమె స్వాధీనంలోనే ఉంది.. శ్రీదేవి కుటుంబం ప‌రిధిలోనే ఉంది. ఇక్క‌డ ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారు. అయితే.. శ్రీదేవి మ‌ర‌ణానంత‌రం.. ఆమె పేరును మార్పు చేస్తూ.. కుమార్తెలు, భ‌ర్త రీ రిజిస్ట్రేష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ఇక్క‌డే అస‌లు స్టోరీ మొద‌లైంది. మొదిలియార్ రెండో భార్య‌కు చెందిన కుమారులు.. ఈ ఆస్తిలో త‌మ‌కు భాగం ఉంద‌ని.. తాము చిన్న‌ప్పు డు.. త‌మ‌కు తెలియ‌కుండా త‌మ తండ్రి విక్ర‌యించార‌ని పేర్కొంటూ.. 2024లోకోర్టుకు వెళ్లారు. ఈ కేసును లోతుగా విచారించిన హైకోర్టు.. కొట్టి వేసింది. శ్రీదేవి స‌ద‌రు స్థ‌లం కొనుగోలు చేసే స‌మ‌యానికి.. మొద‌లియార్‌కు రెండో భార్య ఉంద‌ని.. ఆమె ఎలాంటి అభ్యంత‌రం పెట్ట‌లేద‌ని సో.. ఈ కేసు చెల్ల‌నేర‌ద‌ని పేర్కొంది. అయితే.. హైకోర్టు ఇచ్చిన తీర్పును మొదిలియార్ రెండో భార్య పిల్లలు సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. అప్ప‌ట్లో తాము చిన్న‌పిల్ల‌ల‌మ‌ని.. పేర్కొన్నారు.

ఇప్పుడు తాము మేజ‌ర్లం కాబ‌ట్టి.. త‌మ‌కు కూడా హ‌క్కు ఉంటుంద‌ని వాదించారు. ఈ ప‌రిణామాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు .. వారికి హ‌క్కు ఉంటుందా.. ఉండ‌దా..అనే విష‌యంలోకి తాము వెళ్ల‌డం లేద‌ని.. అయితే, వివాదాన్ని రాజీ మార్గం ద్వారా ప‌రిష్క‌రించు కోవాల‌ని సూచించింది. దీంతో శ్రీదేవి ఫ్యామిలీ.. ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అస‌లు క‌థ‌లోనే లేని క్యారెక్ట‌ర్లు తెర‌మీదికి వ‌చ్చార‌ని.. అప్ప‌ట్లో వీరు(మొదిలియార్ వార‌సులు) లేర‌ని.. ఇప్పుడు ఎలా ఆస్తిలో భాగం సంక్ర‌మిస్తుంద‌ని ప్ర‌శ్నించారు. అయిన‌ప్ప‌టికీ సుప్రీంకోర్టు.. మాత్రం మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారానే కేసును ప రిష్క‌రించుకోవాల‌ని సూచించింది.