ఈ శుక్రవారం విడుదల కానున్న ఎపిక్ సినిమా మీద ప్రేక్షకుల్లో ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఇటీవల రిలీజైన ట్రైలర్ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో ఇంటిమేట్ సీన్లు, డైలాగుల విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పలేదు. ఈ నెగెటివిటీ తనకు పెద్ద షాక్ అని కూడా దర్శకుడు ఆదిత్య హాసన్ తాజాగా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు.
నైంటీస్ మిడిల్ క్లాస్ దర్శకుడి నుంచి ప్రేక్షకులు ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఊహించినట్టు లేరు. అందుకే ఈ మిక్స్డ్ రెస్పాన్స్ కావచ్చు. ఐతే సినిమాలో ప్రేక్షకులు ఊహించని విషయాలు, షాకులు మరిన్ని ఉంటాయేమో మరి.. ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నిర్మాత నాగవంశీ.
ఒక ఇంటర్వ్యూలో క్లైమాక్స్ గురించి ఆడియన్స్ కు ఒక హెచ్చరిక లాంటి కామెంట్ చేశాడు ఈ ప్రొడ్యూసర్. ఈ సినిమాకు రెగ్యులర్ మూవీస్ తరహా ముగింపు ఉండదని నాగవంశీ చెప్పాడు. సినిమా ఉన్నట్లుండి, హఠాత్తుగా ఆగిపోయినట్లు అనిపిస్తుందని.. ప్రేక్షకులు అనుకున్నట్లుగా క్లైమాక్స్ ఉండదని నాగవంశీ అన్నాడు. ఇందుకు కారణమేంటో కూడా ఆయన చెప్పాడు.
సినిమాల్లో మామూలుగా క్లైమాక్స్ ప్లాన్ చేసుకుంటారని.. కానీ నిజ జీవితంలో ఒక లవ్ స్టోరీలో ముగింపును ప్లాన్ చెయ్యలేమని నాగవంశీ చెప్పాడు. అందుకే రియల్ గా ఇద్దరు మనుషుల మధ్య ఏం జరుగుతుందో అలా సినిమాకు ఎండింగ్ ఇచ్చామని.. అది కొంచెం ఆడ్ గా కూడా అనిపించే అవకాశం ఉందని అన్నాడు.
నిజ జీవితంలో ఏమైనా జరగొచ్చని, అది అంచనా వేయలేమని.. ఎపిక్ మూవీలో వనపర్తి టౌన్ నుంచి వచ్చిన అబ్బాయి, హైదరాబాద్ సిటీ నుంచి వచ్చిన ఒక మోడర్న్ అమ్మాయి లండన్లో కలుసుకుంటే ఎలా ఉంటుందో.. వారికి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో.. వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేశామని.. అంతా సహజంగా ఉంటుందని నాగవంశీ అన్నాడు.
ఇందులో సన్నివేశాలు, సంభాషణలు ఎక్కడా చూసి ఉండరని.. అంత సహజంగా ఆదిత్య సినిమా తీశాడని నాగవంశీ తెలిపాడు. ట్రైలర్లో చూపించిన శృంగారం తర్వాతి కాన్వర్జేషన్లు, పీరియడ్స్ డైలాగ్స్ లాంటివి సినిమాలో సహజంగా, కొత్తగా ఉంటాయని నాగవంశీ చెప్పాడు. నాగవంశీ మాటలు చూస్తుంటే ట్రైలర్ రెస్పాన్స్ తర్వాత ప్రేక్షకులను సినిమాలో ఉన్న అంశాలకు ముందే ప్రిపేర్ చేస్తున్నట్లు ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates