సంచ‌ల‌న పాత్ర‌లో శ్రుతి హాస‌న్

క‌మ‌ల్ హాస‌న్ త‌న‌యురాలు హీరోయిన్‌గా అడుగు పెడుతోందంటే.. ఆయ‌న లాగే ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లు, సినిమాలు ఎక్కువగా చేస్తుంద‌ని అంతా అనుకున్నారు కానీ.. శ్రుతి హాస‌న్ మాత్రం అందుకు భిన్నంగా రొటీన్ గ్లామ‌ర్ పాత్ర‌లే చేస్తూ వ‌చ్చింది. మిగ‌తా హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్లామ‌ర్ విందు చేసింది. ఎక్కువ‌గా ఆమె చేసింది క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే.

తాజాగా క్రాక్ లాంటి మాస్ మ‌సాలా సినిమాలో ఆమె క‌నిపించింది. ఐతే కెరీర్లో కొంచెం లేటుగా ఓ ప్రయోగాత్మ‌క, సంచ‌ల‌న పాత్ర చేయ‌డానికి శ్రుతి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఐతే ఈ పాత్ర చేయ‌నున్న‌ది సినిమాలో కాదు. వెబ్ సిరీస్‌లో. దాని విశేషాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

త‌న‌కంటే రెట్టింపు వ‌య‌సున్న మిథున్ చ‌క్ర‌వ‌ర్తికి జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌బోతోంద‌ట‌. ఈ నిన్న‌టి త‌రం బాలీవుడ్ న‌టుడు ప్ర‌ధాన పాత్ర‌లో ‘ది బెస్ట్‌ సెల్లర్ షయీ రోట్‌ అనే నవల ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్ రూపొంద‌నుంది. పెద్ద వ‌య‌స్కుడు, ఎంతో పేరు పొందిన‌ నవలా రచయితకు, అత‌డి అభిమాని అయిన ఓ యువ‌తికి మ‌ధ్య జ‌రిగే రొమాంటిక్ ల‌వ్ స్టోరీనే ఈ ‘ది బెస్ట్‌ సెల్లర్ షయీ రోట్. ఇందులో న‌వ‌లా ర‌చ‌యిత‌గా మిథున్ చ‌క్ర‌వ‌ర్తి.. అత‌డి ప్రేయ‌సిగా శ్రుతి హాస‌న్ న‌టించ‌నున్నార‌ట‌.

ముకుల్‌ అభ్యంకర్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌నుండ‌గా.. సిద్ధార్థ్‌ పి.మల్హోత్రా నిర్మించ‌నున్నారు. ఓ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం ఈ సిరీస్ తెర‌కెక్కుతోంది. ఇలాంటి పాత్ర‌ను చేయ‌డానికి స్టార్ హీరోయిన్లు అంత ఈజీగా ఒప్పుకోరు. కానీ శ్రుతి ధైర్యం చేసింది. మ‌రి ఈ పాత్ర‌తో శ్రుతి ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందో చూడాలి.