అల్లరోడి కంబ్యాక్ అందరి కోరిక

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ తిరిగి తన కామెడీ జానర్ లో సినిమా చేశాడు. ఇవాళ రంభ ఊర్వశి మేనక థియేటర్లలో అడుగు పెట్టింది. మహర్షి నుంచి సీరియస్ టర్న్ తీసుకుని తనకు సూట్ కాని బచ్చల మల్లి లాంటి ప్రయోగాలు చేసిన నరేష్ ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా పూర్తి కామెడీ కథను ఎంచుకోవడం, దానికి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ దన్నుగా నిలవడం ప్లస్ అయ్యాయి. ప్రమోషన్లు గట్రా బాగానే చేశారు. పోటీ ఉన్నా సరే రిస్క్ తీసుకున్నారు.

ముందు రోజు ప్రీమియర్లు వేయడం లాంటివి చేయకుండా రంభ ఊర్వశి మేనక టీమ్ తెలివైన నిర్ణయం తీసుకుంది. లేనిపోని టాక్స్, స్పాయిలర్స్ కు అవకాశం ఇవ్వడం కన్నా ఇదే మంచిది. ఇక సగటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఫ్యాన్ డంతో సంబంధం లేకుండా అందరూ అల్లరి నరేష్ కంబ్యాక్ ని కోరుకుంటున్నారు. మూడేళ్ళ క్రితం ఆ ఒక్కటి అడక్కు అని ఒక ఎంటర్ టైన్మెంట్ సినిమా చేశాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో కొంత గ్యాప్ వచ్చింది.

నలుగురు హీరోయిన్లతో దర్శకుడు చంద్రమోహన్ పూర్తి వినోదాత్మకంగా రంభ ఊర్వశి మేనకని ట్రై చేశారు. ఇలాంటి మాస్ కామెడీ గత కొన్నేళ్లలో రాలేదు. వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్లు, ఫాంటసీ, హారర్ సినిమాలే ఎక్కువగా వస్తున్న టైంలో ఇలాంటి ప్రయత్నం చేయడం మంచిదే. కాకపోతే ట్రీట్ మెంట్ కొత్తగా ఉండాలి. జెన్ జీ జనాలు కూడా కన్విన్స్ అయ్యేలా నవ్వించాలి. అప్పుడే థియేటర్ పరంగా వర్కౌట్ అవుతుంది. అల్లరోడి నుంచి మరిన్ని సినిమాలు వస్తాయి.

వంద చిత్రాల మైలురాయిని టార్గెట్ గా పెట్టుకున్న అల్లరి నరేష్ దానికి ఇంకో ముప్పై నాలుగు సినిమాల దూరంలో ఉన్నాడు. అంత ఈజీ కాదు కానీ బోలెడు వయసు ఉంది కాబట్టి సాధ్యమే. అదే జరిగితే ఇప్పటి జనరేషన్ లో ఎవరికీ సాధ్యం కానీ ఒక అరుదైన ఫీట్ అందుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే టాలీవుడ్ టయర్ 1 నుంచి టయర్ 10 దాకా ఏ హీరోని తీసుకున్నా మహా అయితే యాభై సినిమాలు మించి చేసే ఛాన్స్ లేదు. అలాంటిది అల్లరి నరేష్ ఆ ఘనత అందుకుంటే పెద్ద విశేషమే.