ఫౌజీ 90 రోజుల ప్లాన్ ఎలా ఉంటుంది

పదకొండు నెలల గ్యాప్ తర్వాత ప్రభాస్ దర్శనం చేయించే ఫౌజీ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. స్పిరిట్ అంత హైప్ లేనట్టుగా పైకి కనిపిస్తున్నా ఫౌజీకి పని చేసిన వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం దర్శకుడు హను రాఘవపూడి ఆవిష్కరించే ప్రపంచం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేయడం ఖాయమట. అంత గొప్ప విజువల్స్, కంటెంట్ కుదిరాయని, బాహుబలి తర్వాత ఆ స్థాయిలో చెప్పుకునే ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని తెగ ఊరిస్తున్నారు. నిజమెంతో చూడాలి.

ఇక 90 రోజుల టాపిక్ విషయానికి వస్తే డిసెంబర్ మూడో తేదీ ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే సరిగ్గా తొంభై రోజుల దూరంలో ఉంది. అంటే కేవలం మూడు నెలలు. ఇంకా షూటింగ్ కొంత బ్యాలన్స్ జరుగుతోంది. ప్రభాస్ వీలైనంత సహకారం అందిస్తూ చివరి షెడ్యూల్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అన్ని భాషలకు సంబంధించిన వర్క్స్ ఎలాంటి జాప్యం రాకుండా చూసుకోవడం పెద్ద ఛాలెంజ్ గా మారింది.

మళ్ళీ వాయిదా ప్రసక్తే లేకుండా టార్గెట్ అందుకోవడానికి టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోంది. అప్డేట్స్ ఈ నెల నుంచే ప్రారంభించబోతున్నట్టు ఇరుముడి సక్సెస్ ప్రెస్ మీట్ లో నిర్మాత చెప్పడం చూస్తుంటే వినాయక చవితి నుంచి ఫౌజీ కంటెంట్ ని ఆశించవచ్చు. ఇమాన్వి హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడిక్ డ్రామాలో బ్రాహ్మణ సామజిక వర్గానికి చెందిన బ్రిటిష్ సైనికుడిగా ప్రభాస్ పాత్ర చాలా డిఫరెంట్, ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఉంటుందని టాక్.

నవంబర్ అధిక భాగం పబ్లిసిటీకి కేటాయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పుష్ప తరహాలో దీన్ని నార్త్ ఆడియన్స్ కి బాగా చేరువ చేయగలిగితే ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. ఎలాగూ పీరియాడిక్ మూవీ కాబట్టి ట్రైలర్ గట్రా సరిగ్గా కనెక్ట్ అయ్యాయంటే హిందీ బెల్టులో వసూళ్లు అదిరిపోతాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ ఆల్బమ్ నుంచి మొదటి పాట సెప్టెంబర్ చివరిలో వచ్చే అవకాశముంది. ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ కాకూడదనేది ఫ్యాన్స్ కోరిక.