సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్ 4 థియేటర్లకు వచ్చేందుకు రూటు క్లియర్ చేసుకుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన ముగ్గురు హీరోయిన్ల శరీర మధ్య భాగాన్ని బ్లర్ చేయడం ద్వారా సమస్యని తగ్గించుకున్నారట. అలాగే కొన్ని డైలాగులు మ్యూట్ చేయడం, రెండు మూడు చిన్న కట్స్ కి ఎస్ చెప్పడంతో టెన్షన్ తీరిపోయింది. సరే అసలు విషయానికి వద్దాం.
ఇతిహాసాల్లో, పాత సినిమాల్లో రంభ ఊర్వశి మేనకలను ఎక్కడా దేవతలుగా చూపించలేదు. ఇంద్రుడి కొలువులో నర్తకీమణులుగానే ప్రెజెంట్ చేస్తూ వచ్చారు. యమగోల, యమలీల, రంభ రాంబాబు, దేవాంతకుడు ఇలా ఏ సినిమా చూసినా వాళ్ళ ప్రస్తావన ఇలాగే ఉంటుంది. యముడికి మొగుడులో చిరంజీవి ఏకంగా వీళ్ళను ఉద్దేశించి పాట పాడి, డాన్స్ ఇలా చేయాలి అంటూ హీరోయిన్ అంబికతో స్టెప్పులు వేయించడం ఓ రేంజ్ లో పేలింది.
యమగోలలో ఎన్టీఆర్ ఏకంగా ఇంద్రుడిని, రంభని విమర్శిస్తూ భారీ కౌంటర్ డైలాగులు కూడా వేస్తారు. ఇవన్నీ సెన్సార్ దాటుకుని వచ్చినవే. మరి ఇప్పుడు కొత్తగా కాస్ట్యూమ్స్ ఇలా ఉండకూడదని చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ మాటకొస్తే జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఇంద్రుడి కూతురిగా నటించిన శ్రీదేవి రెండున్నర గంటలు చీరలో ఉండదు. రాఘవేంద్రుల వారు దుస్తుల విషయంలో తెలివిగా వ్యవహరించి తగిన మోతాదులో గ్లామరస్ గా చూపించారు.
మరి ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చాయో లేక రూల్స్ ని కఠినంగా పాటిస్తున్నారో ఏమో కానీ గత రెండేళ్లుగా మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలు టైటిల్ దగ్గరి నుంచి సన్నివేశాల వరకు చాలా సమస్యలు ఎదురుకుంటున్నాయి. కొన్ని ఏకంగా వాయిదా పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. సెన్సార్ వాళ్ళది తప్పని చెప్పలేం కానీ ఏ భాషలో ఈ స్థాయిలో రాని అబ్జెక్షన్లు టాలీవుడ్ లోనే ఎక్కువ రావడం విచిత్రంగా ఉంది. ఆఖరికి సరస్వతి అని టైటిల్ పెట్టుకున్నా అభ్యంతరం వస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
