మాములుగా ఓటిటి కంటెంట్ ని అదే పనిగా థియేటర్లో చూడటం కష్టం. ఎందుకంటే బుల్లితెర మీద ఒక కథను చూశాక మళ్ళీ టికెట్లు కొని వీక్షించాలంటే అదనపు బరువనిపిస్తుంది. థియేటర్ నుంచి ఓటిటికి రావడంలో ఇబ్బంది కానీ ఇది రివర్స్ లో పని జరగడం చాలా అరుదు. టాలీవుడ్ లో ఇది బ్రేక్ చేసిన సినిమా మా ఊరి పొలిమేర 2. మొదటి భాగం డిజిటల్ లో నేరుగా రిలీజైనా దాని సక్సెస్ తర్వాత మూవీ మీద నమ్మకంతో సీక్వెల్ ని థియేటర్ కు తీసుకొచ్చారు నిర్మాతలు.
ఊహించిన దానికన్నా పెద్ద ఫలితం దక్కింది. కట్ చేస్తే ఇప్పుడు పొలిమేర 3లో యాక్షన్ కింగ్ అర్జున్ లాంటి స్టార్లు పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం మిర్జాపూర్. ఈ వారం సెప్టెంబర్ 4 హిందీతో పాటు తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ విలేజ్ పొలిటికల్ డ్రామాని తొలుత సినిమాగా ప్రకటించినప్పుడు అందరూ అనుమానంగా చూశారు వర్కౌట్ అవుతుందాని.
తీరా చూస్తే మిర్జాపూర్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. బుక్ మిస్ షోలో ఆల్రెడీ మంచి నెంబర్లు చూపిస్తోంది. గంటకు రెండు వేల దాకా టికెట్లు పోతున్నాయి. దీని మీద ఆసక్తి కలగడానికి కారణాలున్నాయి. వెబ్ సిరీస్ తో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త కథ రాసుకున్నారు. చనిపోయిన మున్నాని మళ్ళీ బ్రతికించారు. రవి కిషన్ లాంటి యాక్టర్లను తీసుకొచ్చి వయొలెన్స్ పెంచారు. సెన్సార్ బోర్డు ముప్పై అయిదు సెకండ్ల వీడియో కట్స్ చెప్పిందంటే ఏ స్థాయిలో తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు.
ఇంకో విశేషం ఏంటంటే మిర్జాపూర్ నిడివి 3 గంటల 17 నిముషాలు. అంటే యానిమల్ రేంజ్ లో లెన్త్ పెట్టేశారన్న మాట. కథ డిమాండ్ చేయడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని దర్శకుడు గుర్మీత్ సింగ్ అంటున్నారు. ఊహించని ట్విస్టులతో ఈసారి మిర్జాపూర్ బెస్ట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని హామీ ఇస్తున్నారు. తెలుగులో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మిర్జాపూర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఈ సిరీస్ హింస, బూతులకు ఒక ఫ్యాన్ బేస్ ఉన్న మాట నిజం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
