నయనతారకు దెబ్బ మీద దెబ్బ

హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ చాలా కొద్దిమందే సంపాదించుకుంటారు. నయనతార ఆ కోవకే చెందుతుంది. సౌత్ ఇండియాలో తనకంటే వయసు తక్కువైన కొందరు హీరోలను పక్కన పెడితే.. దాదాపు అందరు టాప్ స్టార్లతోనూ ఆమె సినిమాలు చేసింది. ఇక గత దశాబ్ద కాలంలో ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె మెప్పించింది. ఇప్పటికీ స్టార్ల సరసన సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది.

కాకపోతే కొన్నేళ్ల నుంచి బాక్సాఫీస్ దగ్గర ఆమెకు అస్సలు కలిసి రావడం లేదు. ముట్టుకున్నదల్లా మసి అయిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా రెండు రోజుల వ్యవధిలో ఆమె రెండు ఫెయిల్యూర్లను ఖాతాలో వేసుకుంది. అందులో ఒకటి.. టాక్సిక్. ఇందులో ఆమె హీరోయిన్ కాదు. కానీ హీరో యశ్‌కు సోదరిగా కథలో చాలా కీలకమైన పాత్రే పోషించింది. ఈ చిత్రం ఫస్ట్ షోతోనే డిజాస్టర్ అని తేలిపోయింది. నయనతార పాత్ర, నటనకు కూడా అంత మంచి స్పందనేమీ రాలేదు.

మరోవైపు నయన్.. తమిళంలో ‘బిగ్ బాస్’ గుర్తింపుతో మంచి మంచి సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదుగుతున్న కవిన్‌కు జోడీగా ‘హాయ్’ అనే సినిమా చేసింది. ఇది వయసు అంతరం ఉన్న కథతో నడిచే సినిమా. కానీ కాన్సెప్ట్ ఉన్నంత డిఫరెంట్‌గా సినిమా లేకపోవడంతో ప్రేక్షకులకు ఇది ఏమాత్రం రుచించడం లేదు. తొలి రోజే సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది. వీకెండ్లోనే ఈ సినిమాకు సరైన వసూళ్లు లేవు. తెలుగులో కూడా ఒకసారి రిలీజ్ చేశారు కానీ.. ఏమాత్రం ప్రమోషన్లు లేకపోవడం, టాక్ కూడా బాలేకపోవడంతో మన ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు.

నయనతార ఫెయిల్యూర్ స్ట్రీక్ కొత్తగా మొదలైంది కాదు. ఈ ఏడాది నిర్మాతగా కూడా ఆమెకు ‘ఎల్ఐకే’ చేదు అనుభవాన్ని మిగిల్చింది. తన భర్త విఘ్నేష్ శివన్‌ను దర్శకుడిగా నిలబడదామని చేసిన ప్రయత్నం భారీ నష్టాలను మిగిల్చింది. మధ్యలో తెలుగులో చిరంజీవితో చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ పెద్ద హిట్టయినా.. తమిళంలో మాత్రం టెస్ట్, అన్నపూర్ణ, ఇరైవన్, కనెక్ట్, ఓ2, కేఆర్కే.. ఇలా చాలా ఫ్లాపులే ఎదుర్కొంది నయన్. దీంతో సుందర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్’ మీదే నయన్ ఆశలు నిలిచి ఉన్నాయి.