ఓ హారర్ థ్రిల్లర్ కథ కోసం హీరోను వెతుకుతున్న సమయంలో ఓ యువ నటుడి పేరు వచ్చిందట. ఒకప్పుడు హిందీ మార్కెట్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకు ఇప్పటికీ ఓ మోస్తరు మార్కెట్ ఉంది. బడ్జెట్ కూడా ఎక్కువే కావడంతో తెలిసిన హీరో ఉంటే బిజినెస్‌కు ఉపయోగపడుతుందని నిర్మాతల టీమ్‌లో కొందరు అనుకున్నారట. కానీ అతనితో గతంలో పని చేసిన ఒక వ్యక్తి మాత్రం వెంటనే మరో మాట చెప్పాడట. హీరో రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతాడని కాదు. లొకేషన్‌లో ఎప్పుడు ఏ డిమాండ్ పెడతాడో చెప్పలేమని అతను చెప్పినట్లు సమాచారం.
షూట్ కోసం బ్రాండెడ్ షూస్, డ్రెస్సులు కావాలని అడగడం, వాటిని తర్వాత తనతో తీసుకెళ్లడం లాంటివి కూడా జరిగాయని గుర్తు చేశాడట. అందులో యాపిల్ చార్జర్ ఘటన మాత్రం మరీ వింతగా ఉందట. ఒక రోజు షూటింగ్ లొకేషన్‌లో కొత్త యాపిల్ చార్జర్ లేకపోవడంతో హీరో పని ఆపేశాడని చెప్పారట. అక్కడున్న వాళ్ల దగ్గర మరో చార్జర్ ఉన్నా వాడలేదట. కారులో ఉన్న వాడిన చార్జర్ ఇచ్చినా ఒప్పుకోకుండా, కొత్తది కొనుక్కొచ్చే వరకు షూటింగ్ ముందుకు వెళ్లలేదని ఆ వ్యక్తి చెప్పినట్లు కథనం.
ఇలాంటి విషయాలు విన్నాక నిర్మాతలు హీరో మార్కెట్ కంటే షూటింగ్ రోజుల గురించే ఎక్కువగా ఆలోచించారట. రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినా ఓకే కానీ, ప్రతి రోజు లొకేషన్‌లో కొత్త టెన్షన్ వద్దని అనుకున్నారట. చివరకు ఆ హీరో పేరును అక్కడితో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొత్త దర్శకుడితో చేయాల్సిన ప్రాజెక్ట్. కథ బాగుందని నిర్మాతలు భావిస్తున్నా బడ్జెట్ మాత్రం చిన్నది కాదట. అలాంటి సమయంలో షూటింగ్ ఒక్క రోజు ఆగినా ఖర్చు పెరుగుతుంది. అందుకే హీరోకు మార్కెట్ ఉండటం ఒక్కటే సరిపోదని, పని చేసే విధానం కూడా తమకు సెట్ కావాలని నిర్మాతల టీమ్ భావించినట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
