మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ దాన్నో ఇష్యూ చేయడం ద్వారా లేనిపోని ట్రోల్స్ కు అవకాశమిస్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఒక ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. నాలుగు లైన్ల శుభాకాంక్షలతో పాటు చివర్లో కట్టె కాలేవరకు చిరు ఫ్యాన్ అని అర్థం వచ్చేలా ట్యాగ్ పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం బన్నీ వ్యక్తితంగా మెగాస్టార్ అభిమాని కావడం కాదు.

చాలా కాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య ఏవేవో ఉన్నాయంటూ బయట ప్రచారాలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టే చరణ్, బన్నీ, చిరంజీవి బయట ప్రత్యేకంగా కలుసుకుంటున్న సందర్భాలు లేవు. ఏదో ఫ్యామిలీ వేడుక జరిగితే తప్ప. కానీ మేమంతా ఒకటేనని అల్లు అరవింద్ ఎప్పటికప్పుడు ఈ విషయంగా క్లారిటీ ఇస్తూనే వచ్చారు. ఇదిలా ఉంచితే నెక్స్ట్ మెగాస్టార్ బన్నీనే అంటూ అర్థం వచ్చేలా కొందరు ఫ్యాన్స్ మొన్న ట్రెండ్ చేయడం మెగాభిమానులను హర్ట్ చేసింది.

అనూహ్యంగా అల్లు అర్జున్ ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి అంటూ బయట పడటం కొత్త చర్చకు దారి తీసింది. అయితే దీనికి చిరు చాలా ఆలస్యంగా స్పందించి కేవలం చిన్న థాంక్స్ చెప్పి వదిలేయడం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. అందరికీ మంచి మంచి పదాలు వాడి మాకు మాత్రం జస్ట్ థాంక్స్ అంటారా అంటూ రివర్స్ అయ్యారు. నిజానికి స్టార్ హీరోల హ్యాండిల్స్ ని వ్యక్తిగత సహాయకులు ఆపరేట్ చేస్తుంటారు. ఎక్కువ సందర్భాల్లో ఆన్ లైన్ సమాధానాలు ఇచ్చేది కూడా వాళ్ళే.

వీళ్ళు పెట్టే ప్రతి పదానికి జవాబుదారి హీరోలే అవుతారు. అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకపోతే ఇలాంటి లేనిపోని సమస్యలు వస్తాయి. ఫ్యాన్స్ కూడా సంయమనంతో ఉండాలి. ప్రతి దాన్ని హైలైట్ చేయాలని చూడటం వల్ల అందరికీ డ్యామేజ్ జరుగుతుంది. చిన్న మ్యాటర్ ఇలా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే చిరంజీవి, బన్నీ ఇద్దరూ చేసింది రైటే. కానీ వాటి అర్థాలు, స్పందించిన సమయాలు బోలెడు అపార్థాలకు దారి తీశాయి. జెన్ జీ కాలం ఇలాగే ఉంటుంది మరి.