తమిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ శంకర్. కథానాయిక కావడానికి ముందు ఆమె టీవీ యాంకర్‌గా పని చేసింది. ఒక టీవీ సీరియల్లోనూ నటించింది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి తెలుగు వాడైన వైభవ్ రెడ్డి (కోదండరామిరెడ్డి తనయుడు) హీరోగా నటించిన మెయ్యాదమన్ సినిమాలో కథానాయికగా మారి తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత చూస్తుండగానే తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది.
కాకపోతే తెలుగులో మాత్రం ప్రియకు కలిసి రాలేదు. సంతోష్ శోభన్ సరసన ఇక్కడ నటించిన తొలి చిత్రం కళ్యాణం కమనీయం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత గోపీచంద్ సరసన భీష్మ, సత్యదేవ్‌కు జోడీగా జీబ్రా సినిమాలుచేయగా.. అవీ నిరాశపరిచాయి. నాగచైతన్యతో దూత వెబ్ సిరీస్ మంచి స్పందనే తెచ్చుకున్నా అది ఓటీటీకే పరిమితమైంది. థియేట్రికల్ హిట్ కోసం చూస్తున్న ప్రియకు ఇప్పుడు ఇరుముడి రూపంలో మంచి విజయమే దక్కేలా కనిపిస్తోంది.
శుక్రవారం రిలీజైన ఇరుముడి మంచి టాక్ తెచ్చుకుని ఘనవిజయం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో రవితేజకు జోడీగా మిడిల్ క్లాస్ మహిళ పాత్రలో ప్రియ చక్కగా ఒదిగిపోయింది. 10 ఏళ్ల అమ్మాయి తల్లి పాత్ర అయినా.. ఎలాంటి సంకోచం లేకుండా ఈ పాత్ర ఒప్పుకున్న ప్రియ, ఆ క్యారెక్టర్లో చాలా చక్కగా నటించింది. ఇందులో తన కంటే కూతురి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం దక్కినా.. ప్రియ తన పరిధిగా బాగా పెర్ఫామ్ చేసింది.
ఈ పాత్రలో తన అప్పీయరెన్స్, నటన చూశాక ఇకపై పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కోసం ప్రియను బాగానే కన్సిడర్ చేసే అవకాశముంది. విశేషం ఏంటంటే.. ప్రియకు ఇంకా పెళ్లి కాకపోయినా.. సినీ పరిశ్రమలోకి రావడానికి ముందే తనకు పరిచయమున్న జశ్వంత్ అనే అబ్బాయితో ఆమె కలిసి ఉంటోంది. ఇద్దరూ కలిసి కొత్త ఇల్లు కూడా తీసుకున్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates