కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్ ఏర్పడింది. తన సినిమా వస్తోందంటే మంచి రేట్ ఇచ్చి కొనుక్కునే నిర్మాతలకు కొదవ లేదు. పైగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటం బిజినెస్ పరంగా ప్లస్ అయ్యేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఒకదాన్ని మించిన మరొక డిజాస్టర్స్ తో కార్తీ తన రేంజ్ తగ్గించుకున్నాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పాయింట్ ప్రస్తావించడానికి సహేతుకమైన కారణముంది. అదేంటో చూద్దాం.

కార్తీ కొత్త మూవీ సర్దార్ 2 థియేటర్ రిలీజ్ జరుపుకున్న కేవలం 21 రోజులకే రేపటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. దీంతో పాటు ఒకే రోజు రిలీజైన మండాడి నూటా యాభై కోట్ల వైపు పరుగులు పెడుతుండగా కాంపిటీషన్ లో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ ఇంత అన్యాయంగా మూడో వారానికే డిజిటల్ కి రావడం ట్రాజెడీ. దీనికన్నా ముందు వా వతియార్ (అన్నగారు వస్తారు) జస్ట్ 14 రోజులకే ఓటిటిలో రావడం ఫ్యాన్స్ మర్చిపోలేదు. ఈ రెండింటి ప్లాట్ ఫార్మ్ ఒకటే కావడం గమనించాల్సిన విషయం.

వీలైనంత త్వరగా కార్తీ తన ప్రయాణం ఎటు వెళ్తుందో విశ్లేషణ చేసుకోవాలి. నిర్మాణంలో ఉన్న మార్షల్ కూడా బాగా ఆలస్యమవుతోంది. శైలేష్ కొలనుతో హిట్ 4 ది ఫోర్త్ కేస్ చేసేందుకు కార్తీ ఉత్సాహంగా ఉన్నాడు కానీ ఇది ఇప్పట్లో తేలేలా లేదు. ఖైదీ 2 గురించి ఎంత డిమాండ్ ఉన్నా లోకేష్ కనగరాజ్ అదేమీ పట్టనట్టు వేరే హీరోలతో సినిమాలు చేసుకుంటున్నాడు. కమల్ హాసన్, విజయ్, రజనీకాంత్ తర్వాత ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ తో చేతులు కలిపాడు. సో ఖైదీ 2 జరిగే పనిలా లేదు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నువ్వు ఒకప్పుడు ఏమిటనేది ఆడియన్స్ కి అనవసరం. ఇప్పుడు ఏం ఇస్తున్నావనేది కీలకం. అది జనాన్ని మెప్పించకపోతే ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సర్దార్ 2 కోసం కార్తీ ఫిజికల్ గా మెంటల్ గా బాగా కష్టపడ్డాడు. అయినా సరే దారుణమైన ఫలితం అందుకుంది. హీరో ఎవరైనా థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ అంతకంతా తగ్గిపోవడం మొదలైతే అది పెద్ద ప్రమాద సంకేతం. అన్నయ్య సూర్యలాగా కంబ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.