రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. పర్ఫెక్షన్ అంటే ఏంటో జక్కన్న సినిమాలు చూస్తే అర్థమవుతుంది. పేపర్ మీద రాసుకున్నపుడు ఎంతో కష్టం అనుకునే సన్నివేశాలను సైతం అద్భుతంగా తీస్తారని రాజమౌళి గురించి అందరూ కొనియాడుతుంటారు. ‘వారణాసి’కి సంబంధించి ఒక సీన్‌ను ఎలా తీస్తానో తనకే తెలియదని వ్యాఖ్యానించి, తర్వాత మేకింగ్‌లో అద్భుతం చేశాడంటూ స్వయంగా దర్శకుడే అయిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ఆశ్చర్యపోతూ చెప్పాడు.
ఐతే రాజమౌళి టేకింగ్‌లో అంత పర్ఫెక్షన్ ఉండడానికి ముందుగా చేసే రిహార్సల్స్, వర్క్ షాప్‌లు ముఖ్య కారణం అని ఆయనతో పని చేసేవాళ్లు చెబుతుంటారు. ఐతే జస్ట్ రిహార్సల్స్ చేయడం కాదు.. ముందే ఆయన తన సినిమాను డమ్మీ షూట్ చేసి కూడా పక్కన పెట్టేస్తాడట. తాను ఈ పద్ధతిని అనుసరించడమే కాదు.. తనతో అసోసియేట్ అయ్యే వేరే దర్శకులకు కూడా ఇదే చెబుతారట.
‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్న శశాంక్ యేలేటి రాజమౌళి ఫాలో అయ్యే ‘బ్లాక్ అండ్ షూట్’ పద్ధతి గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రాజమౌళి తనయుడు కార్తికేయ, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కలిసి ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమాను నిర్మించడంతో రాజమౌళి కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యాడు. కథ విన్నాక ‘బ్లాక్ అండ్ షూట్’ చేయమని రాజమౌళి తనకు చెప్పగా అదేంటో తనకు అర్థం కాలేదని.. అప్పుడు తన అసిస్టెంట్‌ను కలవమన్నాడని.. ఆయన దాని గురించి వివరిస్తే.. ఆ ప్రకారమే డమ్మీ షూట్ చేసినట్లు శశాంక్ తెలిపాడు.
తన ఏడీలను పెట్టుకుని స్క్రిప్టు దగ్గర పెట్టుకుని అన్ని సన్నివేశాలను డమ్మీగా తీసేశామని.. దీని వల్ల తర్వాత సినిమా తీయడం చాలా తేలికైపోయిందని శశాంక్ చెప్పాడు. దీని వల్ల ప్రొడక్షన్ డిజైనర్, కెమెరామన్, ఎడిటర్.. వీళ్లందరి పని తేలికైపోయిందని.. తనకు కూడా మేకింగ్ విషయంలో ముందే క్లారిటీ వచ్చిందని.. ఎఫెక్ట్ తగ్గిన సీన్లను మళ్లీ రాసుకున్నానని.. ఈ డమ్మీ షూట్ రష్ పెట్టుకుని షూట్ చేస్తే బెటర్ ఔట్ పుట్ కూడా రాబట్టగలిగామని శశాంక్ తెలిపాడు. రాజమౌళి అనుసరిస్తున్న ఈ పద్ధతి వర్ధమాన దర్శకులకు ఎంతో ఉపయోగకరం అనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
