జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు. ఫహద్ ఫాసిల్ హీరోగా రూపొందిన ఈ చైల్డ్ ఎంటర్ టైనర్ కథ మేజిక్ తెలిసిన ఒక చిన్న పాప చుట్టూ తిరుగుతుంది. మొన్నటిదాకా బజ్ సంగతేమో కానీ నిన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం, వాటి తాలూకు క్లిప్స్ సోషల్ మీడియాలో తిరగడం, తన స్పీచులు అభిమానులకు టచింగ్ గా ఉండటం ఇవన్నీ కలిసి ఫహద్ మూవీ మీద ఫోకస్ వచ్చేలా చేశాయి.

ఒక స్టార్ ఇంకో సినిమా వేడుకకు వెళ్లినంత మాత్రాన ఓపెనింగ్స్ అమాంతం బద్దలైపోవు కానీ ఎంతో కొంత మైలేజ్ అయితే ఖచ్చితంగా పెంచుతాయి. అందులోనూ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం, కొడుకు కార్తికేయ నిర్మాత కావడం, ఆర్కా మీడియా బ్యానర్ మీద రూపొందటం ఇవన్నీ మార్కెటింగ్ కోణంలో అడ్వాంటేజ్ అయ్యాయి. సహజంగా వారణాసి వల్ల మహేష్ బాబు ఫ్యాన్స్ మద్దతు కూడా దీనికి దక్కొచ్చనే కామెంట్స్ ని అంత ఈజీగా కొట్టేయలేం. ఛాన్స్ అయితే ఉంది.

శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మీద ఫహద్ ఫాసిల్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఎందుకంటే తెలుగులో పుష్ప ఇచ్చిన విలన్ ఇమేజ్ నుంచి హీరోకి షిఫ్ట్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అదే జరిగితే మలయాళం నుంచి వచ్చే తన డబ్బింగ్ సినిమాలకు మార్కెట్ పెరిగి తద్వారా బిజినెస్ ని పెద్ద స్థాయికి తీసుకెళ్లొచ్చు. అందుకే కేరళ కంటే ఎక్కువ హైదరాబాద్ లోనే వారాల తరబడి ఉంటూ పబ్లిసిటీ పరంగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.

ఫైనల్ గా జనాన్ని మెప్పించాల్సింది కంటెంట్ కాబట్టి అదెలా ఉంటుందనే దాని మీదే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ప్యారడైజ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని లాగడంలో విఫలం కావడంతో అక్టోబర్ 2 నుంచి ఆ అడ్వాంటేజ్ ఎవరు తీసుకుంటారనే దాని గురించి ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అంటూ బాలయ్య డైలాగుని టైటిల్ గా పెట్టుకున్న ఈ మూవీ చిన్నపిల్లలతో కనక జై కొట్టించుకుంటే ఆటోమేటిక్ గా పెద్దలను థియేటర్లకు తీసుకొస్తుంది.