ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత త‌మిళంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న‌ది అజిత్‌కే. ఒక ద‌శ‌లో వ‌రుస హిట్ల‌తో ర‌జినీ, విజ‌య్‌ల‌ను కూడా కొంచెం వెన‌క్కి నెట్టాడు. విశ్వాసం లాంటి మామూలు మాస్ మూవీతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన ఘ‌న‌త త‌న సొంతం. కాక‌పోతే ఈ మ‌ధ్య అజిత్ జోరు కొంచెం త‌గ్గింది. స‌క్సెస్ రేట్ త‌గ్గ‌డం, త‌ర‌చుగా సినిమాలు చేయక‌పోవ‌డం మైన‌స్ అయింది.

అయినా అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ వేరే లెవెల్ అన‌డానికి తాజాగా ఒక ప్రక‌ట‌న‌కు ఆయ‌న తీసుకున్న పారితోష‌కం గురించి వ‌స్తున్న వార్త‌లే నిద‌ర్శ‌నం. త‌న సినిమాల ప్ర‌మోష‌న్ల‌కే కాదు, యాడ్స్‌లో న‌టించ‌డానికి కూడా అజిత్ దూరమే. కానీ తాజాగా నోవా అనే రియ‌ల్ ఎస్టేట్ కంపెనీకి ఆయ‌న ప్ర‌చారం చేశారు.

ఈ కంపెనీ కోసం ఒక నిమిషం నిడివి ఉండే ప్ర‌క‌ట‌న‌లో న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు అజిత్. ఇందుకుగాను ఆయ‌న ఏకంగా రూ.40 కోట్ల పారితోష‌కం తీసుకున్నాడ‌న్న వార్త సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అజిత్‌కు ఎంత డిమాండున్నా స‌రే.. నిమిషం యాడ్‌కు 40 కోట్లా అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కానీ ఎప్పుడూ యాడ్స్ చేయ‌ని అజిత్ ఇలా ఒక రియ‌ల్ ఎస్టేట్ కంపెనీకి ప్ర‌చారం చేయ‌డం పెద్ద విష‌య‌మ‌ని.. త‌న ద్వారా చేకూరే ప్ర‌యోజ‌నంతో పోలిస్తే అది ఎక్కువేమీ కాద‌ని ట్రేడ్ పండిట్లు అంటున్నారు.

ఈ ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ రూపొందించాడు. అతను కూడా రూ.3 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నాడ‌ట‌. కానీ ఈ నంబర్లు నమ్మశక్యంగా అయితే లేవన్నది ప్రధాన వాదన.

ఇదిలా ఉంటే.. గ‌త ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీతో పెద్ద హిట్ కొట్టిన అజిత్.. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ఆధిక్ ర‌విచంద్ర‌న్‌తోనే స్వీయ నిర్మాణంలో కొత్త సినిమా చేస్తున్నాడు. యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రానికి రెడ్ డెవిల్ అనే టైటిల్ కూడా ఖ‌రారు చేశారు.