అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే మాట‌కు అస‌లైన అర్థం చెబుతూ తెలుగు సినిమాను ఎంత‌గానో ప్ర‌భావితం చేసిందీ చిత్రం. ఐతే రిలీజ్‌కు ముందే బంప‌ర్ క్రేజ్ తెచ్చుకుని.. విడుద‌ల త‌ర్వాత అంచ‌నాల‌ను మించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది కానీ.. మేకింగ్ టైంలో మాత్రం అర్జున్ రెడ్డికి క‌ష్టాలు త‌ప్ప‌లేదు. అప్ప‌టికే పెళ్ళిచూపులు చిత్రంతో విజ‌య్ స‌క్సెస్ సాధించిన‌ప్ప‌టికీ.. ఈ మూవీకి ప్రొడ‌క్ష‌న్ క‌ష్టాలు త‌ప్ప‌లేద‌ట‌.

ఒక నిర్మాణ సంస్థ ఈ చిత్రంలో 50 శాతం పెట్టుబ‌డి పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చి, మ‌ధ్య‌లో హ్యాండ్ ఇచ్చేసింద‌ట‌. ఈ విష‌యాన్ని సందీప్ సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. స‌ద‌రు నిర్మాణ సంస్థ‌తో అగ్రిమెంట్ కూడా జ‌రిగిందని, కానీ సినిమా మొద‌ల‌య్యాక  ఇది స‌క్సెస్ అవుతుందో లేదో అని భ‌య‌ప‌డి ఆ సంస్థ వెన‌క్కి త‌గ్గింద‌ని.. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మొత్తం సినిమాను తామే ప్రొడ్యూస్ చేయాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌ణ‌య్ తెలిపాడు. డ‌బ్బులు త‌క్కువైతే త‌మ కుటుంబానికి ఉన్న మామిడి తోట‌ను అమ్మి ఈ సినిమా పూర్తి చేసిన‌ట్లు ప్ర‌ణ‌య్ చెప్పాడు.

ఇక స్పిరిట్ సినిమాలో కొరియా న‌టుడు డాన్ లీతో పాటు చిరంజీవి కూడా న‌టించ‌ట్లేదని స్ప‌ష్టం చేసిన ప్ర‌ణ‌య్.. ఈ చిత్రం నుంచి ప్ర‌కాష్ రాజ్ త‌ప్పుకున్న‌ట్లు కూడా ధ్రువీక‌రించాడు. మ‌హేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా గురించి అడ‌గ్గా.. ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న మాట వాస్త‌వ‌మే అయినా సినిమా అయితే ఓకే కాలేద‌ని స్ప‌ష్టం చేశాడు.

స్పిరిట్ త‌ర్వాత సందీప్ యానిమల్ పార్క్ సినిమా చేస్తాడ‌ని ప్ర‌ణ‌య్ తెలిపాడు. ప్ర‌ణ‌య్ ఓవైపు స్పిరిట్ మూవీ నిర్మాణ వ్య‌వ‌హారాలు చూసుకుంటూనే.. సుమంత్ ప్ర‌భాస్, అనంతిక జంట‌గా రోమాంచకం అనే యూత్ ఫుల్ ల‌వ్ స్టోరీ ప్రొడ్యూస్ చేశాడు. ఆ చిత్రం సెప్టెంబ‌రు 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.