ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే కాఫీ విత్ కరణ్ అనడంలో మరో మాట లేదు. దీని చుట్టూ ఎన్నో వివాదాలు కూడా ముసురుకున్నప్పటికీ.. ఈ షో అత్యంత ఆదరణ పొందిందనడంలో సందేహం లేదు. బాలీవుడ్లో దాదాపుగా ప్రతి పేరున్న ఆర్టిస్ట్ ఈ షోలో భాగం అయ్యారు. టెక్నీషియన్లు కూడా చాలామంది ఇందులో పాల్గొన్నారు.
తెలుగు సినిమా నుంచి ప్రభాస్, రాజమౌళి, రానా దగ్గుబాటి, సమంత, విజయ్ దేవరకొండ తదితరులు ఈ షోలో పాల్గొని అభిమానులను అలరించారు. ఐకానిక్ స్టేటస్ తెచ్చుకున్న ఈ షో ముగింపు దశకు వచ్చేసింది. ఈ షోకు ఎండ్ కార్డ్ వేయబోతున్నట్లు హోస్ట్ కరణ్ జోహార్ ప్రకటించాడు. ఒక ఎమోషనల్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు కరణ్.
2004లో ఈ సెలబ్రెటీ టాక్ షోను మొదలుపెట్టాలనుకున్నపుడు తన తండ్రితో చర్చించానని, కానీ డబ్బులు ఎలా అని ఆయన కంగారు పడ్డారని.. అదే నెలలో ఆయన మరణించారని, ఆయనతో తాను చర్చించిన చివరి ప్రాజెక్ట్ అదే అని కరణ్ గుర్తు చేసుకున్నాడు. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన ఈ షోను ఇప్పుడు ముగించబోతున్నానని.. ఈ షో మీద వివాదాలు వచ్చినప్పటికీ, ఆదరణ ఎప్పుడూ తగ్గలేదని.. తన సినిమాలకంటే ఈ షో అప్‌డేట్స్‌నే అభిమానులు ఎక్కువ అడుగుతుంటారని కరణ్ గుర్తుచేసుకున్నాడు.
8 సీజన్లలో 161 ఎపిసోడ్ల పాటు అలరించిన కాఫీ విత్ కరణ్ షోకు తొమ్మిదో సీజన్‌తో తెరపడబోతోంది. ఈ నెల 14 నుంచి జియో హాట్ స్టార్‌లో 9వ సీజన్ ప్రసారమవుతుంది. ఈసారి షోలో టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్ పాల్గొంటాడని వార్తలు వస్తున్నాయి. అలాగే కరణ్‌కు సన్నిహితులైన బాలీవుడ్ బిగ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కూడా ఈ షోలో సందడి చేస్తారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates
