విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు ఉండటం వల్ల ఇక్కడ థియేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అందుకే ఒరిజినల్ వెర్షన్ కే పరిమితమయ్యారు. హైదరాబాద్ లోనూ కొన్ని షోలు కేటాయించడం గమనార్హం. బత్తాకు సోషల్ మీడియాలో ప్రశంసలు వచ్చి పడుతున్నాయి. అల్లు అర్జున్ రాకా దర్శకుడు అట్లీ బత్తాకు నిర్మాణ భాగస్వామి కావడంతో మూవీ లవర్స్ లో ఆసక్తి నెలకొంది.
ముందు బత్తా కథేంటో చూద్దాం. 80 దశకం నేపథ్యంలో కథ జరుగుతుంది. పేరు మోసిన రౌడీ బత్తా అంటే ఉత్తర మద్రాస్ ప్రాంతంలో అందరికీ భయం. నిత్యం ముఠా గొడవల్లో ఉంటాడు. అనూహ్యంగా జరిగిన ఒక సంఘటన వల్ల బత్తా ఒక పాడుబడిన స్కూల్ బాత్ రూంలో దాక్కుంటాడు. అదే సమయంలో శబరీ అనే చిన్న పిల్లాడు అదే చోట ఇరుక్కుని ఉంటాడు. చిన్న గొడవతో మొదలైన ఇద్దరి మధ్య స్నేహం ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. ఈ స్నేహం ఏమయ్యిందనేది అసలు స్టోరీ.
దర్శకుడు బాలాజీ తరణీధరన్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామాలకు భిన్నంగా మానవ సంబంధాలు, సున్నితమైన ఎమోషన్స్ మీద దృష్టి పెట్టి రౌడీ, స్కూల్ స్టూడెంట్ మధ్య నడిపించిన బాండింగ్ ఆకట్టుకునేలా సాగుతుంది. మధ్యలో లాగ్ అనిపించే స్క్రీన్ ప్లే అక్కడక్కడా ఉన్నప్పటికీ ఫైనల్ గా కొత్తగా బాగుందనే ఫీలింగ్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. భారీ వసూళ్లు తెచ్చే కమర్షియల్ ఎంటర్ టైనర్ కోవలోకి బత్తా రాదు.
చాలా కాలంగా తన స్థాయి సబ్జెక్టు రాక ఏవేవో సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతికి బత్తా ఒక పర్ఫెక్ట్ ఛాయస్. లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంక్కర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్ గా నిలవగా సాంకేతిక నిపుణుల నుంచి రాబట్టుకున్న పనితనం బత్తాని గుడ్ వాచ్ గా మార్చింది. అట్లీ అభిరుచిని ఇందులో మెచ్చుకోకుండా ఉండలేం. చూస్తుంటే కోలీవుడ్ లో మండాడి తర్వాత బత్తా మరో సక్సెస్ ఫుల్ మూవీ అయ్యేలా ఉంది. మనకు డబ్బింగ్ వెర్షన్ త్వరలో రావొచ్చేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates
