పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని సిటీలు, థియేటర్లు ఎంచుకుని షోలు వేస్తుంటే.. పెద్ద సినిమాలకు అన్ని చోట్లా రాత్రి ఫుల్ లెంగ్త్ ప్రిమియర్స్ వేస్తున్నారు. గత వారం వచ్చిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’కు ముందు రోజు సెకండ్ షోలకు ప్రిమియర్స్ వేసిన సంగతి తెలిసిందే. ఈ వారం రిలీజవుతున్న నాలుగు చిత్రాల్లో మూడింటికి ప్రిమియర్స్ పడుతున్నాయి. మరి వచ్చే వారం రిలీజయ్యే విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి కూడా ప్రిమియర్స్ వేస్తారేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కానీ అందుకు అవకాశం లేదని తేల్చేశాడు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాకు ప్రిమియర్స్ ఉండవని.. నేరుగా తొమ్మిదో తారీఖున థియేటర్లలో కలుద్దామని ఆయన స్పష్టం చేశాడు. తన మీద తాను కౌంటర్ వేసుకుంటూ.. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ ప్లాన్స్ గురించి ఎక్స్‌లో పోస్టు పెట్టాడు నాగవంశీ.

తమ సంస్థలో వచ్చే సినిమాల రిలీజ్‌కు సంబంధించిన ప్రణాళికల మీద జనాలకు సందేహాలుంటాయని ఒప్పుకుంటూనే.. ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో అన్నీ పక్కాగానే జరుగుతాయని నాగవంశీ స్పష్టం చేశాడు. ఈ సినిమా పక్కాగా ఈ నెల 9న రిలీజవుతుందని చెబుతూ.. 6వ తేదీన ట్రైలర్ లాంచ్ ఉంటుందని, తర్వాతి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయని నాగవంశీ వెల్లడించాడు.

ఫ్యామిలీస్ పిల్లలతో పరీక్షలు బాగా రాయించి.. సెలవులకు సూటయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వెకేషన్‌ను మొదలుపెట్టాలని.. థియేటర్లకు వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేయాలని నాగవంశీ అన్నాడు. ఈ సందర్భంగా ‘ఆదర్శ కుటుంబం’కు ప్రిమియర్స్ ఉండవనే విషయాన్ని కూడా స్పష్టం చేశాడు నాగవంశీ.

సరిగ్గా దసరా సెలవులు ఆరంభం కావడానికి ముందు ఈ చిత్రం రిలీజవుతుండడంతో పాజిటివ్ టాక్ వస్తే సినిమాకు మంచి రన్, భారీ వసూళ్లు ఉండే అవకాశముంది. వెంకీ సరసన శ్రీనిధి శెట్టి నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ నటించిన తొలి చిత్రమిది.