తెలుగు సినిమాను గిల్లుతున్న షారుఖ్ డైరెక్టర్

‘బాహుబలి’ దగ్గర్నుంచి ఉత్తరాదిన తెలుగు సినిమాల ఆధిపత్యం ఎలా సాగుతోందో చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి’ని తక్కువ అంచనా వేసిన బాలీవుడ్ జనాలు.. ఆ సినిమా సాధించిన అనూహ్య విజయాన్ని చూసి అవాక్కయ్యారు. అప్పటిదాకా సౌత్ సినిమాను తక్కువగా చూసిన వాళ్లు.. ఆ తర్వాత మన చిత్రాలను చూసి అసూయ చెందే పరిస్థితి వచ్చింది. కొందరిలో అది అక్కసుగా మారి.. ఏ చిన్న అవకాశం వచ్చినా మన సినిమాలను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్దార్థ్ ఆనంద్‌ ఇలా ఛాన్స్ తీసుకునేవాళ్లలో ఒకడు. ముందు నుంచే తెలుగు సినిమాల మీద ఒక రకమైన నెగెటివిటీ ఉన్న అతను.. ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌తో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కొంచెం కఠినంగా వ్యవహరించిన దగ్గర్నుంచి ఇంకా మంటెత్తిపోతున్నాడు.

అందుకే అవకాశం వచ్చినపుడల్లా సిద్దార్థ్.. తెలుగు సినిమాలను కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ‘దురంధర్’ బ్లాక్ బస్టర్ అయినపుడు అతను ఇలాగే తెలుగు సినిమాల మీద ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్లు వేశాడు. తాజాగా సిద్దార్థ్ మరోసారి తెలుగు ప్రేక్షకులను గిల్లే ప్రయత్నం చేశాడు.

తాజాగా ఒక నెటిజన్.. హైదరాబాద్‌లో జరిగిన ‘యానిమల్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మల్లారెడ్డి స్పీచ్‌ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశాడు. భవిష్యత్తులో బాలీవుడ్ ఉండదని.. తెలుగు సినిమాదే ఆధిపత్యం అని, సినిమాకు హైదరాబాదే కేంద్రం అవుతుందని.. అందరూ ఇక్కడికి రావాల్సిందే అని చెబుతూ రణబీర్‌ను కూడా హైదరాబాద్‌లో వచ్చి సెటిలైపోమన్నాడు మల్లారెడ్డి.

ఐతే ఆ వీడియోపై ఒక నార్త్ నెటిజన్ స్పందిస్తూ.. గేమ్ చేంజర్, ది రాజాసాబ్, ఓజీ, దేవర లాంటి భారీ తెలుగు సినిమాల పేర్లు ప్రస్తావించి అవి ఫ్లాప్ అయ్యాయని ప్రస్తావించాడు. దీనిపై సిద్దార్థ్ స్పందిస్తూ.. ‘ఊప్స్’ అని కామెంట్ చేయడం ద్వారా తెలుగు సినిమాల మీద తన వ్యతిరేకతను చాటుకున్నాడు.