గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో పాల్గొనేవారు అంతే. అరుదుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్లు. కానీ తర్వాత కథ మారింది. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ లాంటి హీరోలు.. ప్రమోషన్ల అవసరం ఎంత ఉందో, తద్వారా సినిమాకు ఎంతగా రీచ్ పెంచవచ్చో చూపించడంతో.. మన స్టార్లలోనూ మార్పు వచ్చింది. చురుగ్గా ప్రమోషన్లలో పాల్గొనడం మొదలుపెట్టారు.
చాలా రిజర్వ్డ్‌గా ఉండే మహేష్ బాబు లాంటి వాళ్లు కూడా తమ సినిమాలను యాక్టివ్‌గా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మిడ్ రేంజ్ స్టార్లు మరింతగా సినిమాలను పుష్ చేయడం మొదలుపెట్టారు. మీడియాతో చిట్‌చాట్‌లకు తోడు.. వన్ టు వన్ ఇంటర్వ్యూలు కూడా పెరిగాయి. కానీ ఈ మధ్య కథ మారుతోంది. స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు మీడియాకు దొరకడం కష్టమైపోతోంది. ఇంటర్వ్యూలు అయితే దాదాపు క్లోజ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
తమ సినిమాలకు మీడియా పుష్ అవసరం అనుకున్న చిన్న సినిమాలకు సంబంధించిన వాళ్లు ఇంటర్వ్యూలు ఇస్తున్నారే తప్ప.. కొంచెం స్థాయి ఉన్న వాళ్లు క్రమ క్రమంగా వీటికి దూరం అయిపోతున్నారు. ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేకో.. లేదంటే ఈ సోషల్ మీడియా కాలంలో ఏ కామెంట్ చేస్తే ఏం వివాదం ముంచుకొస్తుందనో.. ఇంటర్వ్యూలు ఇవ్వడమే మానేస్తున్నారు. అలా అని సినిమాను ప్రమోట్ చేయకుండా ఆగిపోవట్లేదు. విడివిడిగా మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కాకుండా.. సుమ లాంటి యాంకర్‌ను పెట్టుకుని హీరో హీరోయిన్లు, డైరెక్టర్, యూనిట్లోని ఇంకెవరైనా ముఖ్యులు కూర్చుని కామన్ ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు.
అదే ఇంటర్వ్యూను మీడియాకు ఇచ్చేసి పని అయిపోయిందనిపిస్తున్నారు. దీని వల్ల టైం మిగలడమే కాక.. లేని పోని తలనొప్పులుండవని భావిస్తున్నారు. ఇది రాజమౌళి మొదలుపెట్టిన స్ట్రాటజీ. దీన్నే అందరూ అనుసరిస్తున్నారు. గతంలో మీడియాకు బాగా యాక్సెస్ ఇస్తూ వచ్చిన నాని కూడా ‘ది ప్యారడైజ్’ సినిమాకు ఇదే రూట్ ఫాలో అయ్యాడు. ‘ఆదర్శ కుటుంబం’ టీం సైతం ఇదే మార్గాన్ని ఎంచుకుంది. ఐతే క్రాస్ క్వశ్చన్స్ లేకుండా ఈ వన్ సైడ్ సాగే ఈ ఇంటర్వ్యూలు అభిమానులకు ఏమంత ఆసక్తికరంగా ఉంటాయన్నది ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates
