చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి టాలీవుడ్లో ఎక్కడ లేని డిమాండ్ తీసుకొచ్చింది. ‘దసరా’కు మూడింతల బడ్జెట్లో అతడి రెండో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదల కావడానికి ముందే మెగాస్టార్ చిరంజీవి.. శ్రీకాంత్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు కూడా.

ఐతే ఇలా రైజ్ అయిన దర్శకుడే ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సినిమాతో పైనుంచి కింద పడ్డాడు. ఈ సినిమా కూడా తన జీవితాన్ని మార్చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమాతో చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు శ్రీకాంత్. వీకెండ్ వరకు ఓకే అనిపించినా.. అంతిమంగా ‘ది ప్యారడైజ్’ బాక్సాపీస్ ఫెయిల్యూర్‌గానే నిలవబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో అయితే చిరు-ఓదెల సినిమా ఇప్పట్లో ముందుకు కదిలే సంకేతాలు కనిపించడం లేదు. ‘ది ప్యారడైజ్’ చిరును పునరాలోచనలో పడేసి ఉంటుందనే భావిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని మాట్లాడుతూ.. చిరుతో శ్రీకాంత్ సినిమాకు టైం పడుతుందని చెప్పాడు. ప్రస్తుతం ‘కాకా’ చేస్తున్న చిరు.. దీని తర్వాత వేరే ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి శ్రీకాంత్ తర్వాతి చిత్రం చిరుతో ఉండే అవకాశాలు తక్కువ.

ఇప్పుడు అతను తనేంటో మళ్లీ రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. మధ్యలో వేరే ఒక సినిమా చేసి, దాంతో హిట్టు కొడితే చిరుతో సినిమా ముందుకు కదలొచ్చు. ఐతే ఇప్పుడు అతడికి ఛాన్సిచ్చేదెవరన్నది ప్రశ్న. నాని అయితే అందుబాటులో లేడు. అతడిలా శ్రీకాంత్‌ను నమ్మి స్వేచ్ఛ ఇచ్చి సినిమా చేసే హీరో కావాలి. అంతకంటే ముందు సుధాకర్ చెరుకూరిలా ధైర్యం చేసి డబ్బులు పెట్టే నిర్మాత కూడా రావాలి. అదంతా తేలికగా అనిపించడం లేదు. ఈసారి శ్రీకాంత్ సినిమా ఒప్పించుకోవడంలోనే కాదు.. తీయడంలోనూ చాలా కష్టపడాల్సి రావచ్చు.