ఎన్టీఆర్… ఇలాగే ఉండాలి

తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పట్నుంచి అభిమానులు టెన్షన్ పడుతూ.. మళ్లీ తమ హీరో ఎప్పుడు బయట కనిపిస్తాడో అని ఎదురు చూస్తున్నారు. ఐతే మంగళవారం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు తారక్ హాజరు కావడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

వాళ్లను మరింత సంతోషపెట్టిన విషయం.. తారక్ చాలా ఏళ్ల తర్వాత చాలా ఉత్సాహంగా, సరదాగా, అల్లరి చేస్తూ ఈ ఈవెంట్లో సందడి చేయడం. ఒకప్పుడు తారక్ తన సినిమాల వేడుకల్లో, అలాగే వేరే వాళ్ల ఈవెంట్లలో చాలా సరదాగానే ఉండేవాడు. కానీ వయసు పెరగడం వల్ల వచ్చిన పరిణతి వల్లో.. తండ్రి మరణం వల్లో కానీ.. ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోయాడు.

ఈ సీరియస్‌నెస్ తాత్కాలికమే అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అది ఏళ్ల పాటు కొనసాగింది. సినిమా వేడుకల్లో నవ్వడం కూడా తగ్గించేసి, ముభావంగా కనిపిస్తూ, ప్రసంగాల్లో కూడా సీరియస్‌నెస్ చూపించడం పట్ల చాలామందిలో అసంతృప్తి వ్యక్తమైంది. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అంత సానుకూలంగా లేరు.

మళ్లీ తారక్‌లో మునుపటి జోష్ చూడాలని వాళ్లు కోరుకున్నారు. ఐతే ఎవరైనా ఈ మేరకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారా.. లేక తనే అర్థం చేసుకున్నాడా తెలియదు కానీ.. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ఈవెంట్లో మునుపటి అల్లరి తారక్‌ను చూసే అవకాశం దక్కింది. ఆడిటోరియంలో అడుగుపెట్టగానే బారికేడ్ దూకి రమ రాజమౌళిని ఆత్మీయంగా కౌగిలించుకోవడం దగ్గర మొదలుపెడితే.. ఈ ఈవెంట్లో తారక్ జోష్ మామూలుగా లేదు.

మైత్రి రవిశంకర్ తనను కోట్ చేస్తూ ఏదో మాట్లాడుతుంటే.. సరదాగా తిట్టడం.. ‘వారణాసి’ నిర్మాత కేఎల్ నారాయణతో పరాచకాలాడడం.. రాజమౌళితో కలిసి నవ్వుతూ తుళ్లుతూ కనిపించడం.. అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం.. ఇలా అన్నీ చూసేవాళ్లకు ముచ్చటగా అనిపించాయి. ప్రసంగంలో మొదట కొంత సీరియస్‌నెస్ ఉన్నప్పటికీ.. తర్వాత సరదాగానే మాట్లాడాడు. తారక్ ఇలాగే ఉండాలని.. ఈ జోష్ అభిమానుల్లో తెచ్చే ఉత్సాహమే వేరని.. ఇకముందే ఇదే కంటిన్యూ చేయాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.