తెలుగు వాళ్ల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక ప్రాంతీయ సినీ పరిశ్రమ అయి ఉండి.. బాలీవుడ్‌కు దీటుగా టాలీవుడ్ నిలుస్తోందంటే సినిమా అంటే మన జనాలకు ఉన్న పిచ్చి ఒక ప్రధాన కారణం. సినిమాలు తీసే వాళ్లు కూడా ఆ జనాల నుంచి వచ్చిన వాళ్లే కావడంతోనే టాలీవుడ్ ప్రస్తుతం దేశంలోనే ఒకానొక ప్రముఖ సినీ పరిశ్రమగా వెలుగొందుతోంది.
ముఖ్యంగా కరోనా తర్వాత దేశంలో మిగతా ఇండస్ట్రీలన్నీ పడకేసి ఉంటే.. తెలుగు సినిమా మాత్రం బలంగా పైకి లేచే ప్రయత్నం చేస్తుండటం విశేషం. కరోనా విరామం తర్వాత మన దగ్గర కొంచెం లేటుగానే థియేటర్లు తెరుచుకున్నాయి. కానీ చాలా త్వరగానే వాటికి కళ వచ్చింది. క్రిస్మస్ సీజన్లో రిలీజైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ లాంటి యావరేజ్ మూవీకే జనాలు థియేటర్లకు వరుస కట్టారు. ఇక సంక్రాంతికి వచ్చేసరికి పరిస్థితులు మరింత ఆశాజనకంగా మారాయి.
పండక్కి మన దగ్గర ఒక డబ్బింగ్ మూవీతో కలిసి మొత్తం నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధం కావడం విశేషం. అందులో ఇప్పటికే రిలీజైన ‘క్రాక్’; ‘మాస్టర్’ సినిమాలు అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇంకో రెండు సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్సే వస్తాయని ఆశిస్తున్నాయి. దేశంలో మరెక్కడా బాక్సాఫీస్ దగ్గర ఇంత సందడి లేదు. తమిళంలో మాస్టర్‌తో పాటు మరో సినిమా ‘ఈశ్వరన్’ కూడా రిలీజైంది కానీ.. మనతో పోలిస్తే వాళ్లు వెనుక ఉన్నట్లే. కేవలం సంక్రాంతి అనే కాదు.. ఆ తర్వాతి నుంచి కూడా ప్రతి వారానికీ ఓ సినిమా విడదులకు సిద్ధమవుతుండటం విశేషం.
వేసవి చివరి వరకు దాదాపుగా బెర్తులు ఫుల్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజ్ ఖరారు చేసుకున్నాయి. మిగతా పరిశ్రమల్లో మాత్రం ఇంకా కరోనా ప్రభావం, అనిశ్చితి కొనసాగుతోంది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయన్న మాటే కానీ.. అంతకుమించి మన సినిమా అయితే పూర్వపు పరిస్థితులను అందుకున్నట్లే ఉంది. ఈ విషయంలో దేశానికే టాలీవుడ్ ఆదర్శంగా నిలుస్తోంది. 100 శాతం ఆక్యుపెన్సీకి కూడా అనుమతులు లభిస్తే ఇక టాలీవుడ్‌కు తిరుగులేనట్లే.