యువతిని బెదిరించిన సిప్లిగంజ్‌… ఏపీలో కేసు

తెలంగాణకు చెందిన ప్రియాంక అనే వైద్యురాలిపై ఇద్దరు యువకులు కారు ఎక్కించి ఆమె మరణానికి కారణమైన ఘటన గత వారం రోజులుగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఇప్పుడు తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మీద ఏపీలో కేసు నమోదవడం చర్చనీయాంశం అవుతోంది. తన బావమరిది కోసం ఒక ఏపీ యువతిని రాహుల్ బెదిరించాడట. ఈమేరకు విశాఖపట్నంలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

రాహుల్ సిప్లిగంజ్ బావ మరిది రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. తర్వాత తన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిట్ చేశాడని ఒక యువతి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారని, బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు ఇప్పించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో సిప్లిగంజ్‌తో పాటు పలువువురిపై సైబర్ వేధింపులు, బెదిరింపులకు సంబంధించి కేసులు నమోదు చేశారు వైజాగ్ పోలీసులు.

సిప్లిగంజ్ హైదరాబాద్‌, తెలంగాణకు సంబంధించి లోకల్ ఫోక్ సాంగ్స్‌తో పాపులరిటీ సంపాదించాడు. అతను పాడిన గల్లీగా గణేష్ లాంటి పాటలు తెలంగాణను ఒక ఊపు ఊపేశాయి. ఈ పాపులారిటీతోనే అతను సినిమా పాటల అవకాశాలు అందుకోవడంతో పాటు బిగ్ బాస్ షోలోనూ భాగమయ్యాడు. ఆ షోలో విజేత కావడంతో తన పాపులారిటీ ఇంకా పెరిగింది. 

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సిప్లిగంజ్ పాడిన నాటు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ కావడంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డునే సాధించింది. గత ఏడాది నవంబరులోనే అతను హరిణ్య రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ రెడ్డి ఆమె సోదరుడేనట. మరి ఈ కేసుపై సిప్లిగంజ్ ఏమని స్పందిస్తాడో.. దీన్నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.