విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ అక్టోబరు 2. కానీ ఈ తేదీకి సినిమా రిలీజ్ కాదని కొన్ని వారాల ముందే ఇండస్ట్రీ జనాలకు స్పష్టత వచ్చేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాను సెప్టెంబరు 24కే ఫిక్స్ చేయడం కోసం.. ఆ సినిమా వాయిదా పడితే తమతో పాటు చాలా సినిమాలకు ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి.. ‘ఆదర్శ కుటుంబం’ మేకర్స్ కావాలనే అక్టోబరు 2కు రిలీజ్ డేట్ ఇచ్చారు.
ఒక దశలో వాయిదా గురించి గట్టిగా ఆలోచించిన ‘ది ప్యారడైజ్’ టీం.. ‘ఆదర్శ కుటుంబం’ మేకర్స్ వేసిన ఎత్తుగడతో తప్పక 24నే వస్తోంది. ఆ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. రిలీజ్ దిశగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికైనా ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించవచ్చు కదా. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం.. ఇన్నాళ్లూ ఆడిన గేమ్‌ను కొనసాగిస్తున్నారు.
‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. ‘నారాయణమ్మ’ అంటూ సాగే పాటను ఈ నెల 22న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ పోస్టర్ మీద మళ్లీ అక్టోబరు 2 రిలీజ్ డేట్ అని వేశారు. ఇంకో పది రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ సింగిల్ లాంచ్ చేస్తారంటే జనాలు నమ్మేస్తారా?
‘ఆదర్శ కుటుంబం’ అక్టోబరు 2న రాదన్న క్లారిటీతో సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, తెల్లకాగితం, అనకాపల్లి.. ఇలా బోలెడు సినిమాలు ఆ డేట్ తీసుకున్నాయి. అయినా ‘ఆదర్శ కుటుంబం’ కొత్త డేట్ ప్రకటించకుండా ఇంకా తన ఆటను కొనసాగిస్తోంది. ఈ సినిమా అక్టోబరు 9కి వాయిదా పడుతుందని ఇండస్ట్రీలో, మీడియాలో అందరికీ క్లారిటీ ఉంది.
అయినా ఇంకా జనాలను మభ్యపెట్టేలా అక్టోబరు 2 రిలీజ్ డేట్‌తో పోస్టర్లు ఎందుకు దించుతున్నారో మరి? ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ‘‘ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో దొంగా పోలీస్ ఆడుతున్న’’ డైలాగ్‌ను గుర్తు చేసేలా ఉందీ వ్యవహారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates