‘లస్ట్’ కథలు ఈసారి బెస్ట్ కాలేదా

కామం కాన్సెప్ట్ మీద తీసిన వెబ్ సిరీస్ గా లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ కు విపరీతమైన ఆదరణ దక్కింది. జనాలు ఎగబడి చూశారు. పేరున్న ఫిలిం మేకర్స్ తో పాటు స్టార్ యాక్టర్స్ మొహమాటం లేకుండా నటించడంతో వ్యూస్ వెల్లువలా వచ్చి పడ్డాయి. రెండో సీజన్ లస్ట్ స్టోరీస్ 2కి కొంచెం ఆదరణ తగ్గినా ఓవరాల్ గా డీసెంట్ వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ కి ఆదాయం తెచ్చింది. తాజాగా లస్ట్ స్టోరీస్ 3 వచ్చింది. స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి దీని గురించి సోషల్ టాక్, రివ్యూస్ ఏమంత ఆశాజనకంగా లేవు.

నాలుగు ఎపిసోడ్ల లస్ట్ స్టోరీస్ నాలుగు భాగాలకు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. నిజ జీవిత భార్య భర్తలు సిద్దార్థ్, అదితిరావు హైదరితో పాటు విజయ్ వర్మ, రాధికా ఆప్టే, అలీ ఫజల్, రాధికా మదన్, గుర్ఫతే పిర్జాదా, సనా థంపి ప్రధాన పాత్రలు పోషించారు, భార్యా భర్తలు, ప్రేయసి ప్రియుల మధ్య సాగే ఎమోషన్స్ కి లస్ట్ ముడిపెట్టి వీటి ద్వారా ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అంతగా వర్కౌట్ కాలేనట్టుంది.

కథల విషయానికి వద్దాం. శృంగారం ప్రధాన వస్తువుగా కథలు రాసే రచయిత్రికి, ఆమె భర్తకు మధ్య జరిగే సంఘటనలు, సన్నివేశాల సమాహారమే మొదటి ఎపిసోడ్. రెండో దాంట్లో ఆధునిక నగరాల్లో రిలేషన్స్ ఎలా ప్రభావితమవుతాయనే దాని మీద, మూడో దాంట్లో ఆఫీస్ లో సంబంధం లేని వ్యక్తుల పట్ల కలిగే ఆకర్షణ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూపించారు. చివరి ఎపిసోడ్ చిన్న ఊళ్లు, ప్రాంతాల నుంచి వచ్చిన యువతీ యువకుల మానసిక స్థితిగతుల మీద సాగుతుంది.

సమస్యల్లా అంచనాల దగ్గర వచ్చింది. టైటిల్ కు తగ్గట్టు ఇందులో బాగా బోల్డ్ కంటెంట్ ఆశించారు ప్రేక్షకులు. కానీ దానికి భిన్నంగా ఈసారి మానవ సంబంధాలు, ఒంటరితనం, కామవాంఛ అంటూ క్లాసులు తీసుకోవడం, స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం, కొన్ని అంశాలను బలవంతంగా జొప్పించడం లాంటివి నిరుత్సాహ పరుస్తాయి. చాలా ఓపిక ఉంటే తప్ప నిడివి తక్కువగానే ఉన్న ఈ సిరీస్ ని భరించడం కష్టమే. ఓన్లీ అడల్ట్స్ అన్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే చూడాల్సిన సిరీస్ ఇది.