యూత్ హీరోలు అందులోనూ బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుర్రాళ్లకు సక్సెస్ లేకపోతే మహా ఇబ్బందవుతుంది. సినిమాలు తీసే నిర్మాతలు వస్తూనే ఉంటారు కానీ మినిమమ్ హిట్ లేకపోతే అభిమానులు నెగటివ్ గా తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అఖిల్ ఈ సమస్యని దశాబ్దం పైగా ఎదురుకున్నాడు. అయ్యగారు అంటూ ట్రోల్ చేస్తున్నా నవ్వుతూ స్వీకరించాడు. ఆఖరికి అదే మాటని విజయానికి మంత్రంలా వాడుకుని లెనిన్ రూపంలో సూపర్ హిట్ కొట్టాడు.
తాజాగా వరుణ్ తేజ్ కూడా ఇదే ఆస్వాదిస్తున్నాడు. వరస డిజాస్టర్లతో మెగా బ్రాండ్ నే డ్యామేజ్ లో పడేసుకున్న తనకు కొరియన్ కనకరాజు రూపంలో పెద్ద ఊరట దక్కింది. మూడు రోజులు వసూళ్లు చాలా బాగున్నాయి. సులభంగా యాభై కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న ఈ హారర్ కామెడీ డ్రామా ఆడియన్స్ ని మెప్పించేసింది. హెచ్చుతగ్గులు ఉన్నా బోర్ కొట్టలేదు, విసిగించలేదు అనే పబ్లిక్ టాక్ కలెక్షన్లుగా మారిపోయింది. ముఖ్యంగా బిసి సెంటర్స్ ఆదరణ చాలా బాగుంది.
నిన్న అఖిల్, ఇవాళ వరుణ్ తేజ్ ఒకేసారి ఇలా విజయాలు అందుకోవడం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక్క హిట్టు ఇంకో అయిదారు సంవత్సరాల కెరీర్ ఇస్తుంది. ఈలోగా ఒకటో రెండో బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తే టయర్ 2లోకి వెళ్లిపోవచ్చు. నాని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చింది ఇదే. స్నేహితుడా, రైడ్ టైంలో తన థియేటర్ బిజినెస్ మహా అయితే నాలుగైదు కోట్లు. ఇప్పుడు ప్యారడైజ్ మీద రెండు వందల కోట్ల వ్యాపారం నడుస్తోంది.
ఇకపై కొణిదెల, అక్కినేని హీరోలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కథల ఎంపికలో. తమకు ఏ జానర్లు సూటవుతాయో, ఎలాంటివి తమ నుంచి ఆడియన్స్ ఆశిస్తున్నారో అర్థమైపోయింది కాబట్టి కాంబోలకు టెంప్ట్ కాకుండా కంటెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి. తేజ సజ్జ విజయ రహస్యం ఇదే. నిదానమే ప్రధానం సూత్రం పాటించినా స్క్రిప్ట్ ల ఎంపికలో పక్కాగా ఉంటాడు. ఏది ఏమైనా లెనిన్, కనకరాజులు హీరోలకే కాదు బాక్సాఫీస్ కూ బూస్టయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates