అల్లు అర్జున్‌కు ఆల్రెడీ హైదరాబాద్‌లో రెండు మల్టీప్లెక్సులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకటేమో ఏషియన్ వాళ్ల భాగస్వామ్యంతో అమీర్ పేటలో సత్యం థియేటర్ ఉన్న స్థానంలో నిర్మించిన ఏఏఏ కాగా.. ఇంకోటి కోకాపేటలో అల్లు కుటుంబమే సొంతంగా కన్‌స్ట్రక్ట్ చేసిన అల్లు సినిమాస్. ఇప్పుడు అల్లు అర్జున్, ఏషియన్ మూవీస్ భాగస్వామ్యంలో కొత్తగా ఇంకో మల్టీప్లెక్స్ మొదలైంది.
దీనికి వేదికైంది విశాఖపట్నం కావడం విశేషం. ఏపీలో అతిపెద్ద నగరమైన వైజాగ్‌లో ఒక భారీ మాల్‌లో భాగంగా ఈ లగ్జరీ మల్టీప్లెక్స్ ఏర్పాటు కావడం పట్ల బన్నీ చాలా ఎగ్జైట్ అయ్యాడు. ముంబయిలో రాకా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న బన్నీ.. మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కోసమే లీవ్ తీసుకుని వచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపాడు.
వైజాగ్ తనకెంతో ఇష్టమైన నగరమని, ఇలాంటి చోట తన పేరుతో మల్టీప్లెక్స్ రావడం నమ్మశక్యంగా లేదని బన్నీ వ్యాఖ్యానించాడు. తన తొలి సినిమా గంగోత్రి షూటింగ్ ఈ సిటీలోనే చేశామని.. అప్పుడు రోడ్డు మీద తాను నడిచి వెళ్తుంటే జనాలు తనను గుర్తు పట్టి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయేవారని.. కానీ ఇప్పుడు ఇదే సిటీలో బయట ఎక్కడా నడవలేని పరిస్థితి వచ్చిందని బన్నీ అన్నాడు.
తన సినిమాలు మరెన్నో వైజాగ్‌లో షూటింగ్ జరుపుకున్నాయని.. ఇక్కడ తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని.. ఇలాంటి సిటీలో ఇంత పెద్ద మాల్, అందులో తన మల్టీప్లెక్స్ రావడం అంటే కల నిజం కావడం కంటే పెద్ద విషయమని బన్నీ పేర్కొన్నాడు. కొత్తగా నిర్మితమైన భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి బన్నీ మాట్లాడుతూ.. వరల్డ్ క్లాస్ లెవెల్లో దీన్ని నిర్మించారని, ఈ ఎయిర్ పోర్టు వల్ల దుబాయ్ తరహాలో వైజాగ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates