ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. సినిమాల ప్రభావం సమాజం మీద చాలానే ఉంటుందన్నది వాస్తవం. అత్యంత ఆకర్షణీయమైన మీడియం కాబట్టి.. జనాలు సినిమా వల్ల బాగా ప్రభావితం అవుతారు. ఐతే అందులో మంచి కంటే చెడే ఎక్కువ అన్నది ఎక్కువమంది అభిప్రాయం. దీన్ని ఖండించలేం కూడా. ఐతే కొన్ని సందర్భాల్లో సినిమా వల్ల ఎంతో మంచి కూడా జరుగుతుంటుంది.
మెసేజ్ ఇస్తే ఎవరు పట్టించుకుంటారు అంటుంటారు కానీ… సినిమా చూసే లక్షల మందిలో కొంతమందికి ఆ మెసేజ్ చేరినా దాని వల్లే చేకూరే ప్రయోజనం అమూల్యమైంది. అందుకు ఉదాహరణ.. తాజాగా తమిళనాట జరిగిన ఒక ఘటన. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ చూసి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక నిందితుడిని పట్టించింది ఓ చిన్నారి. ఈ చిత్రంలో ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ మీద ఒక సందేశాత్మక సన్నివేశం ఉంటుంది. పిల్లల్ని మగవాళ్లు ఎక్కడ టచ్ చేస్తే ఒప్పు, ఎక్కడ టచ్ చేస్తే తప్పు అన్నది స్కూల్ పిల్లల ముందు హీరో స్పీచ్ ఇస్తాడు.
ఆ సన్నివేశం చూసిన కేకేనగర్‌కు చెందిన 8 ఏళ్ల బాలిక తనకు ఎదురైన లైంగిక వేధింపుల విషయాన్ని తండ్రికి చెప్పింది. ఆ చిన్నారి తల్లి పని చేసే ఇంటికి చెందిన వ్యక్తి తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుసుకున్న ఆ తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేశారు. దీంతో విజయ్ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి.
కానీ ఈ సినిమాలో ఆ సన్నివేశం వెనుక ఉన్న అసలు వ్యక్తి టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. అతను తీసిన ‘భగవంత్ కేసరి’లో బాలయ్య ఒరిజినల్ సీన్ చేశారు. ఈ సీన్‌తో పాటు మహిళల సాధికారత మీద సినిమాలో చూపించిన అంశాలు విజయ్‌కి చాలా నచ్చే తన చివరి చిత్రంగా దీన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘జననాయగన్’కు తమిళంలో అంత మంచి టాక్ రాకపోయినా.. విజయ్ చివరి చిత్రం కావడంతో జనం బాగానే చూశారు. ఇది ఫుల్ రన్లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates