ప్యారడైజ్ టీం… జాగ్రత్త పడాల్సిందే

నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో రాబోతోంది ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి హైప్ మామూలుగా లేదు. ఫస్ట్ గ్లింప్స్‌తోనే బలమైన ముద్ర వేసిన ఈ చిత్రం.. ‘ఆయా షేర్’ పాటతో ఒక ఊపు ఊపేసింది. ఆ దెబ్బతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. కానీ ఇటీవల రిలీజైన టీజర్ మాత్రం కొంచెం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. 

టీజర్ కొంచెం హడావుడిగా, గందరగోళంగా అనిపించడం.. వయొలెన్స్ విషయంలో ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోయారనే ఫీలింగ్ రావడం వల్ల సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటుగా టీం దృష్టిపెట్టాల్సిన ఇంకో ముఖ్య విషయం కూడా ఉంది. అదే.. డైలాగ్స్ అండ్ డబ్బింగ్. టీజర్లో నాని చెప్పిన డైలాగులు అర్థం కాక స్లో మోషన్లో వినడం, సబ్ టైటిల్స్ పెట్టుకోవడం లాంటివి చేశాం అంటూ నెటిజన్లు స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది టీంకు కచ్చితంగా ఒక హెచ్చరికే.

నాని కెరీర్లో ఇంతకుముందు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘దసరా’కు కూడా డైలాగ్స్ కొంత సమస్యగా మారాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూరల్ తెలంగాణకు చెందిన దర్శకుడు కావడంతో అక్కడి యాసనే తన సినిమాల్లో పెడుతున్నాడు. గతంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసకు ప్రాధాన్యం పెరిగింది. ఆ యాసలోనే ఫుల్ లెంగ్త్ సినిమాలు వస్తున్నాయి. కానీ మరీ రూరల్ స్థాయికి వెళ్లిపోతే అందరు ప్రేక్షకులకూ అర్థం కాదు. రీచ్ తగ్గుతుంది. ఒకవేళ ఆ యాస పెట్టినా డైలాగులు కొంచెం స్లోగా ఉండేలా చూసుకోవాలి. క్లారిటీ ముఖ్యం. 

‘ది ప్యారడైజ్’ టీజర్లో ఆ క్లారిటీ మిస్ అయి, డైలాగులు మరీ ఫాస్ట్‌గా ఉండి తెలంగాణేతర ప్రేక్షకులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఇక్కడ ‘ప్రాంతీయ’ అంశాన్ని తెరపైకి తేవాల్సిన అవసరం లేదు. భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాను ఎక్కువమందికి రీచ్ అయ్యేలా చూడడం ముఖ్యం. ఏ యాస పెట్టినా ఓకే కానీ.. డైలాగులు క్లారిటీ ఉండేలా చూసుకోకుంటే మాత్రం అది సినిమాకు ప్రతికూలంగా మారుతుంది. ఇక్కడ డబ్బింగ్ జాగ్రత్తగా చేయించడంతో పాటు బీజీఎం, సౌండ్ డిజైన్ కూడా డైలాగులను డామినేట్ చేయకుండా చూసుకోవడం కీలకం. కాబట్టి ‘ది ప్యారడైజ్’ టీం అప్రమత్తం కావాల్సిందే.