స్పిరిట్‌… నెల రోజుల హాలిడే

ఇప్పటిదాకా సందీప్ రెడ్డి వంగ తీసినవి మూడే సినిమాలు. అందులో ఒక కథను రెండుసార్లు తీశాడు కాబట్టి.. ఒక రకంగా అతను చేసినవి రెండు సినిమాలుగానే భావించాలి. ఐతేనేం తనకున్న క్రేజ్ అలాంటిలాంటిది కాదు. యూత్ తన సినిమాలంటే పిచ్చెక్కిపోతారు. రాజమౌళి తర్వాత ఇండియాలో అత్యధిక ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న దర్శకుల్లో అతనొకడు అంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు అతను ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌తో ‘స్పిరిట్’ చేస్తుండగా.. దానిపై అంచనాలు మామూలుగా లేవు. పక్కా ప్లానింగ్‌తో సినిమా చేసే సందీప్ రెడ్డి.. ఏడెమినిది నెలలుగా ఈ సినిమా షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రభాస్‌కు వేరే కమిట్మెంట్లు ఉండడం, అప్పుడప్పుడు అందుబాటులోకి వస్తుండడంతో షూటింగ్ నిరంతరాయంగా ఏమీ సాగట్లేదు. ఐతే గత రెండు మూడు నెలల్లో రెబల్ స్టార్ ఎక్కువ డేట్లు ఇచ్చింది మాత్రం ‘స్పిరిట్’ చిత్రానికే. దీంతో దాదాపు సగం సినిమా చిత్రీకరణ అయిపోయింది. ఐతే ప్రభాస్ కొన్ని రోజులు ‘స్పిరిట్’ వైపు చూడబోడని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డే వెల్లడించాడు.

ఈ శుక్రవారం విడుదల కానున్న ‘కేజేక్యూ’ సినిమా ప్రమోషన్ కోసం సందీప్ రెడ్డి ఒక హ్యాండ్ వేశాడు. ఆ చిత్ర దర్శకుడు కేకే (కిరణ్)తో సందీప్‌కు అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్రధారులతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘స్పిరిట్’ షూట్ అప్డేట్ ఇచ్చాడు సందీప్. నాన్ స్టాప్‌గా షూట్ కొట్టామని.. ఐతే ఇప్పుడు నెల రోజులు తమకు హాలిడే వచ్చిందని సందీప్ తెలిపాడు. ప్రభాస్ వేరే సినిమా మీదికి వెళ్తుండడమే కారణమని చెప్పాడు.

ఆ చిత్రం ‘ఫౌజీ’ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రానికి డిసెంబరు 3 రిలీజ్ డేట్ ఖరారు చేయడంతో దాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ప్రభాస్ చూస్తున్నాడు. హైదరాబాద్ శివార్లలో ఛార్మినార్ సెట్ వేసి ఆ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. నెల పాటు నిర్విరామంగా షూట్ జరుగుతుందని సమాచారం. అంతటితో ‘ఫౌజీ’లో ప్రభాస్ పని పూర్తి కావచ్చు. ఆ తర్వాత ‘స్పిరిట్’కే అంకితం అవుతాడు ప్రభాస్. ఆ చిత్రం వచ్చే మార్చిలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా కూడా అవగొట్టాక ‘కల్కి-2’కు మళ్లుతాడు ప్రభాస్.