తొలి రోజు మాస్ రాజా విధ్వంసం

మాస్ రాజా ఈజ్ బ్యాక్ అంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు టాలీవుడ్ అభిమానులు. సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ కొత్త సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అదిరే ఆరంభం లభించింది. శనివారం విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఆ రోజు అడ్డంకులు ఎదురు కావడం.. ఎంతో సందిగ్ధత, ఉత్కంఠ తర్వాత పరిమిత సంఖ్యలో సెకండ్ షోలు పడటంతో సినిమాకు మోక్షం లభించిన సంగతి తెలిసిందే.

జనవరి 10 టాలీవుడ్‌కు కలిసి రాని తేదీ కావడంతో అతి కష్టం మీదే ముందు రోజే సినిమా రిలీజయ్యేట్లు చేశారు కానీ.. వాస్తవానికి ఆదివారమే ‘క్రాక్’కు డే-1గా భావించాలి. ముందు రోజు ఎదురు చూపుల తర్వాత షోలు పడేసరికి ఈ సినిమా పట్ల అందరిలోనూ ఒక రకమైన సానుభూతి వచ్చింది. సినిమాకు టాక్ కూడా బాగుండటంతో ఆదివారం తెలుగు ప్రేక్షకులు ‘క్రాక్’కు బ్రహ్మరథం పట్టారు.

రవితేజ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన ‘క్రాక్’.. మెజారిటీ థియేటర్లలో తొలి రోజు హౌస్ ఫుల్స్‌తో నడిచింది. గత ఏడాది సంక్రాంతి సందడి తర్వాత రాంగ్ టైమింగ్‌లో, తక్కువ థియేటర్లలో రిలీజైన రవితేజ చిత్రం ‘డిస్కో రాజా’ బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాన్నందుకుంది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా రవితేజ సినిమాకు అతి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాతో పోలిస్తే 2-3 రెట్లు ఎక్కువగా తొలి రోజు ‘క్రాక్’ వసూళ్లు ఉండొచ్చని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.

ఇంకా ఫిగర్స్ బయటికి రాలేదు కానీ.. ఐదు కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటాయని అంచనా. 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో నడుస్తున్న ఈ సమయంలో ఈ స్థాయి వసూళ్లంటే చిన్న విషయం కాదవు. సోమవారం వీక్ డే అయినప్పటికీ ‘క్రాక్’కు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఇంకో రెండు రోజులు సోలోగా బాక్సాఫీస్‌ను దున్నుకోవచ్చు ‘క్రాక్’. ఆ తర్వాత ఈ సినిమా పరిస్థితేంటన్నది మిగతా సంక్రాంతి సినిమాలకు వచ్చే టాక్ మీద ఆధారపడి ఉంటుంది.