దొంగ నా కొడుకు మామూలోడు కాదు

మౌళి టాక్స్ పేరుతో యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలు చేసుకుంటూ గుర్తింపు సంపాదించిన కుర్రాడు మౌళి. అలాంటి నేపథ్యం ఉన్న కుర్రాడు హీరోె అవతారం ఎత్తుతాడని, తొలి సినిమాతోనే రూ.40 కోట్ల వసూళ్ల మార్కును అందుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ముందుగా ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ సిరీస్‌తో ఆకట్టుకున్న అతను.. గత ఏడాది ‘లిటిల్ హార్ట్స్’ మూవీలో లీడ్ రోల్ చేసి మెప్పించాడు. హీరో అంటే హీరోలా కాకుండా పాత్రకు తగ్గట్లుగా నటించి మెప్పించిన మౌళి.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు.

ఐతే ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రావు. బాక్సాఫీస్ దగ్గర కూడా అలాంటి మ్యాజిక్‌లు ప్రతిసారీ జరగవు. ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత సరైన సినిమా ఎంచుకోవడమే మౌళికి పెద్ద సవాల్ అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ సినిమా సక్సెస్ చూసి ఏదో ఊహించుకుని, స్టార్‌లా ఫీలై హీరోయిజం చూపించాలనుకుంటే బొక్క బోర్లా పడడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపించాయి.

ఐతే మౌళి మామూలోడు కాదని.. తన రెండో సినిమా ప్రకటనతోనే అర్థమైపోయింది. ‘దొంగ నా కొడుకు’ పేరుతో తన కొత్త చిత్రాన్ని ఇటీవలే అనౌన్స్ చేశారు. ఈ టైటిల్, ఫస్ట్ లుక్ అదీ చూస్తే.. మౌళి మరోసారి మంచి ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడని అర్థమైంది. ఈసారి కూడా హీరోలా కాకుండా.. తనకు సరిపోయే ఫన్నీ క్యారెక్టర్నే అతను ఎంచుకున్నాడని అర్థమవుతోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి మౌళి చేసిన వీడియో చూస్తే తనెంత ప్లాన్డ్‌గా రంగంలోకి దిగుతున్నాడో, ప్రేక్షకులను ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడో అర్థమవుతుంది. 

ఈ వీడియోలో మౌళిని కట్టేసి పక్కన కూర్చుని అతడి మీద తమ ఆగ్రహాన్ని చూపించారు పేరెంట్స్. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులను ఫారిన్ ట్రిప్‌కు తీసుకెళ్తా అని వ్యాఖ్యానించాడు మౌళి. అదే విషయాన్ని గుర్తు చేయగా, ‘లిటిల్ హార్ట్స్’ పెద్ద హిట్టయితే డబ్బులు నిర్మాతలకు వస్తాయి కానీ, నాకెందుకు వస్తాయి అని దబాయించిన మౌళి.. తన కొత్త సినిమా హిట్టయితే ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తా అనడం, దానికి తండ్రి.. ఈ ‘దొంగ నా కొడుకు’ను నమ్మకండి అంటూ కొత్త సినిమా టైటిల్‌ను ప్రస్తావించడం.. ఇలా ఫన్నీగా సాగిందా వీడియో. 

ఆల్రెడీ ‘దొంగ నా కొడుకు’ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకోగా.. ఇంకా షూట్ మొదలుకాకముందే ఇలాంటి ఫన్నీ వీడియోతో జనాల దృష్టిని మరింత ఆకర్షించే ప్రయత్నం చేశాడు మౌళి. ఈ పాజిటివ్ బజ్ వల్లే ‘దొంగ నా కొడుకు’ డిజిటల్ హక్కలను ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకు కొనేసినట్లు సమాచారం. ఈ బజ‌ మున్ముందూ కొనసాగిస్తే థియేట్రికల్ రైట్స్‌కు కూడా మంచి రేటు రావడం.. సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే మౌళి ఖాతాలో ఇంకో పెద్ద హిట్ పడడం ఖాయం.