ప్యారడైజ్ ప్రీమియర్లకు ఎంత పెంపు ఉంటుంది

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా ది ప్యారడైజ్ మీద మాములు అంచనాలు లేవు. ఈ వారం రాబోయే టీజర్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి హైప్ మీటర్ పెరగడమో తగ్గడమో ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 24 విడుదల తేదీ అధికారికంగా అందులోనే ప్రకటించబోతున్నట్టు తెలిసింది. ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా చెప్పిన డేట్ కి ఖచ్చితంగా వస్తుందని డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందింది.

ఇదిలా ఉండగా ప్యారడైజ్ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాత ముందు రోజు ప్రీమియర్లకు సిద్ధమవుతున్నారు. అయితే స్టార్ హీరోలు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వెయ్యి, ఆరు వందల రూపాయల ఫ్లాట్ రేట్ కాకుండా ఇప్పుడున్న టికెట్ ధర మీద మూడు వందల రూపాయలు అదనంగా హైక్ కోరే ప్రతిపాదన సిద్ధమవుతోందట. అంటే ఆంధ్రప్రదేశ్ లో కనక అనుమతి వస్తే బెనిఫిట్ షో టికెట్ 500 లోపే ఉంటుంది. తెలంగాణలో పర్మిషన్ తెచ్చుకుంటే ఇంకో వంద ఎక్స్ ట్రా అవుతుంది.

మొదటి పది రోజులకు రెగ్యులర్ గా అడిగే హైక్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్యారడైజ్ మీద ఉన్న బజ్, పెరిగిపోయిన ఖర్చు కోణంలో చూసుకుంటే ఇది అవసరం అనిపించే పెంపే. కాకపోతే టాక్ చాలా కీలకం కానుంది. ఎలాగూ ఏ సర్టిఫికెట్ వస్తుందని, అంత వయొలెంట్ కంటెంట్ ఉంది కాబట్టి శ్రీకాంత్ ఓదెల చాలా ధీమాగా నానికి బెస్ట్ ఇస్తానని నమ్మకం వ్యక్తం చేస్తున్నారట. ప్రతి హింసని జస్టిఫై చేసే విధంగా మంచి స్క్రీన్ ప్లే పడిందని వినికిడి.

కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ప్యారడైజ్ లో మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ మెయిన్ విలన్లుగా నటించారు. అనిరుధ్ రవిచందర్ కు సెప్టెంబర్ తొలి వారంలో ఫస్ట్ కాపీ అందజేసే అవకాశం ఉంది. రీ రికార్డింగ్ కి ఎక్కువ స్కోప్ ఉన్న కథ కావడంతో దేవర, జైలర్ స్థాయి అవుట్ ఫుట్ ని మ్యూజిక్ లవర్స్ ఆశిస్తున్నారు. నాని ఏడాదిన్నరకు పైగానే ఈ ప్రాజెక్టు మీద వర్క్ చేస్తున్నాడు. విపరీతమైన జాప్యం జరిగినప్పటికీ ఫైనల్ అవుట్ ఫుట్ టెర్రిఫిక్ గా ఉంటుందని నాని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.