అల్లు అర్జున్ ప్లానింగ్ అందరికీ రాదు

స్టార్ హీరోలు ఎవరికైనా అభిమానులుంటారు. కానీ వాళ్ళతో ఒక ప్రణాళికాబద్ధమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అందరి వల్ల కాదు. సీనియర్లలో చిరంజీవి ఈ విషయంలో ముందు వరుసలో ఉండటం వల్లే బ్లడ్ బ్యాంక్ లాంటి సామజిక ప్రయోజనకర పనులు ఎన్నో చేశారు. నేత్రదానం గురించి 90 దశకంలో విస్తృతంగా ప్రచారం కావడంలో మెగాస్టార్ చేసిన కృషి చాలా ఉంది. పక్క రాష్ట్రంలో సూర్య లాంటి అగ్ర నటుడు సైత చిరుని స్ఫూర్తిగా తీసుకునే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం తెలిసిందే.

దీనికి అల్లు అర్జున్ కి ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని బన్నీ చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. ఏదో ఈవెంట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళను పొగడటం, బయట షూటింగ్స్ దగ్గర ఫోటోలు ఇవ్వడం లాంటివి కాకుండా ఒక సంస్థ తరహాలో తన అభిమాన సంఘాలను బలోపేతం చేసుకునే పనిలో సక్సెస్ అవుతున్నాడు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఫ్యాన్ మీట్ కు తొమ్మిది వందల మందిని ఆరు గంటలకు పైగా మేనేజ్ చేసిన తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.  

వీటి వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకపోవచ్చు. కానీ బన్నీ ఆలోచన అది కాదు. తన అభిమాన గణం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. కేరళలోనూ స్ట్రాంగ్ గా ఉంది. రాకా వచ్చాక హిందీలో మరింత బలపడొచ్చు. అంటే ప్రభాస్ ఏ విషయంలో అయితే కొంత నిర్లక్ష్యంగా ఉన్నాడో అల్లు అర్జున్ దాన్నే అవకాశంగా మలచుకుంటున్నాడు. పుష్ప తెచ్చి పెట్టిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని మరింత పైకి తీసుకెళ్లేందుకు ఫ్యాన్స్ రూపంలో పునాదిని పటిష్ట పరుచుకుంటున్నాడు.

ఈ చర్యల వల్ల అభిమానులకు తమ హీరో తమకు మరింత దగ్గరయ్యాడనే ఫీలింగ్ పెరుగుతుంది. దాని వల్ల మరింత కష్టపడతారు. సోషల్ మీడియా యాంటీ ఫ్యాన్స్, ట్రోల్స్ గురించి బన్నీ ఉద్దేశాలు వివరించిన తీరు వాళ్ళను బాగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరిని స్టేజి మీదకు పిలిచి హత్తుకుని మరీ ఫోటోలు ఇవ్వడం లాంటివి ప్రస్తుతం మాములు విషయాలుగానే కనిపించవచ్చు. కానీ వీటి ఇంపాక్ట్ భవిష్యత్తులో బలంగా ఉంటుంది. ఇంకో పది ఇరవై సంవత్సరాలకు సరిపడా ముందుచూపు బన్నీ వద్ద ఉందని చెప్పాలి.