సంబరాలు ఎప్పుడు… స్వయంభు ఎక్కడ  

మనం ఎంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ జనం నిత్యం మాట్లాడుకునేలా, పాజిటివ్ గా ఫీలయ్యేలా చేయడం చాలా కీలకం. ఎంత ఆలస్యం చేస్తే అంత క్వాలిటీ పెరుగుతుందనేది వట్టి భ్రమ. దాని వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సత్యం గుర్తించని హీరోలు కావాలని చేయకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల రిలీజులు లేటవుతూ చేతులారా బజ్ తగ్గించుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఇక్కడ ఇద్దరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. మొదటి పేరు సాయి దుర్గ తేజ్. సంబరాల ఏటిగట్టు అదిగో ఇదిగో అంటోంది తప్ప డేట్ వేసుకోవడం లేదు. ఎప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అవుతుందో క్లారిటీ లేకనే నిర్మాతలు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. తేజ్ నెలల తరబడి అదే గెటప్ లో తిరుగుతున్నాడు. బడ్జెట్ చేజారిపోయిందని, వీలైనంత త్వరగా గుమ్మడికాయ కొట్టేందుకు దర్శక నిర్మాతలు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఎప్పటికి కొలిక్కి వస్తాయో.

డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సంబరాల ఏటిగట్టు మేకర్స్ ప్రాథమికంగా సిద్ధమైనట్టు సమాచారం. దసరా, దీపావళికి ఆల్రెడీ జైలర్ 2, రామాయణ లాంటి క్రేజీ మూవీస్ రెడీ అవుతున్నాయి. డిసెంబర్ మొదటి వరంలో ఫౌజీ వస్తోంది. ఈ మధ్యలో రణబాలి కూడా వస్తుంది. ఇంత టైట్ షెడ్యూల్ లో సంబరాల ఏటిగట్టుకి స్పేస్ దొరక్కపోతే 2027కి షిఫ్ట్ అవ్వాలి. ఇక రెండో పేరు నిఖిల్ సిద్దార్థ. స్వయంభు షూట్ ఎప్పుడో అయిపోయింది. టీజర్, పాటలు వచ్చి వారాలు నెలలు గడిచిపోయాయి.

సెప్టెంబర్ 11 అనుకున్నారు కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడు చూస్తేనేమో ఆనంద్ దేవరకొండ ఎపిక్, ధనుష్ ఓం లాంటివి క్యూ కడుతున్నాయి. సంబరాల ఏటిగట్టు తరహాలోనే స్వయంభు కూడా హీరో మార్కెట్ ని మించి ఖర్చు పెట్టిన క్రేజీ మూవీ.  కాకతాళీయంగా ఈ రెండు సినిమాల దర్శకులు అనుభవం లేని కొత్త వాళ్ళే కావడం గమనార్హం. కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు అంత ఖర్చు పెట్టారు. అయినా సరే అంతకంతా కాలం కర్పూరంలా కరిగిపోవడం బజ్ మీద ప్రభావం చూపిస్తోంది.