మిడిల్ క్లాస్ కష్టాలను పట్టించుకోలేదా

కొత్త శుక్రవారం వస్తే టాలీవుడ్ కు గంపెడు కొత్త సినిమాలు రావడం కొత్తేమి కాదు. కానీ వాటిలో కనీస స్థాయిలో ప్రేక్షకుల దృష్టిలో పడుతున్నవి ఎన్నని అడిగితే మాత్రం అలోచించి చెప్పాల్సి ఉంటుంది. మొన్న జనాలంతా ది ఒడిస్సి ప్రవాహంలో పడిపోయి వేరే రిలీజులను పట్టించుకోలేదు. కొన్నింటికి పేరున్న క్యాస్టింగ్ ఉన్నా రిజిస్టర్ కాలేకపోయాయి. శ్రీకాంత్, లయ జంటగా నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ ఆ బాపతులోనే వచ్చింది. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు.

నిన్నటి తరం జంట శ్రీకాంత్, లయ చాలా కాలం తర్వాత తమ కాంబినేషన్ రిపీట్ చేయగా నటకిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ మొదటిసారి వెంకటేశ్వరస్వామి పాత్రలో నటించారు. ఒకప్పుడు 6 టీన్స్, సీమ టపాకాయ్, ఈడో రకం ఆడో రకం, సీమ శాస్త్రి లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన నాగేశ్వరరెడ్డి కొంచెం గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో వచ్చారు. ఈవెంట్లు గట్రా వీలైనంత చేశారు కానీ పెద్దగా రీచ్ అవ్వలేదు. దీని వల్ల అంతంత మాత్రం ఓపెనింగ్ తో సర్దుకోవాల్సి వచ్చింది.  

స్టోరీపరంగా గోపాల గోపాల, కృష్ణార్జున తరహా లైన్ లోనే ఇదీ సాగుతుంది. వెంకటరమణ అనే వాచ్ మెన్ తన కష్టాలను తట్టుకోలేక దేవుడిని వేడుకుంటే ఏడుకొండల వాడు దిగివచ్చి తన నగలు ఇచ్చేస్తాడు. కానీ వాటి వల్ల కష్టాలు మరింత పెరుగుతాయి. ఇలా లాభం లేదని ఒక బుక్ ఇచ్చి అందులో ఏం రాస్తే అది తీరిపోయే వరం ఇస్తాడు. దీంతో వెంకటరమణ కోటీశ్వరుడు అవుతాడు. ఆ తర్వాత అసలు సమస్యలు, ప్రమాదాలు మొదలవుతాయి. అదేంటనేది తెరమీద చూడాలి.

సీనియర్ హీరోలు ఉన్నారు కదాని నెరేషన్ స్టైల్ కూడా పాత కాలంలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ నాగేశ్వరరెడ్డి దాన్నే ఫాలో అయిపోయారు. యమలీలకు ఓ మై గాడ్ జోడించి ఏదో చెప్పాలని ప్రయత్నించారు కానీ వీక్ రైటింగ్ వల్ల దొరికిపోయారు. కొన్ని సీన్లు మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ వల్ల ఏదో బండి లాగింది కానీ లేదంటే పరిస్థితి ఇంకా తక్కువలో ఉండేది. అయినా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వాళ్ళను హీరోలుగా పెడితే ఇప్పుడున్న పరిస్థితిలో వర్కౌట్ చేయడం కష్టమే.