న్యూయార్క్ వీధుల్లో న‌క్కిలీసు గొలుసు

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్.. ప్ర‌పంచంలో అత్యంత ఆక‌ర్ష‌ణీయ టూరిస్ట్ ప్లేసెస్, ఎంట‌ర్టైన్మెంట్ హ‌బ్స్‌లో ఒక‌టి. అక్క‌డ డిజిట‌ల్ స్క్రీన్ల‌పై వ్యాపార ప్ర‌క‌ట‌న‌లే కాక‌.. సినిమా, ఇత‌ర ఎంట‌ర్టైన్మెంట్‌ విశేషాల‌ను కూడా పంచుకుంటూ ఉంటారు. అక్క‌డ ఇండియ‌న్ సినిమాల‌కు సంబంధించిన కంటెంట్ ప్ర‌ద‌ర్శిత‌మైతే దాన్నో విశేషంగా చెప్పుకుంటారు. 

అలాంటి చోట ఒక చిన్న తెలుగు సినిమాకు సంబంధించిన పాట ప్లే కావ‌డం విశేషం. ఆ పాటే.. ప‌లాస మూవీలోని నాదీ న‌క్కిలీసు గొలుసు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో న‌క్కిలీసు గొలుసు పాట ప్లే అవుతుండ‌గా.. ఒక తెలుగ‌మ్మాయి ఆ విష‌యాన్ని గుర్తించి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది తెలుగు వాళ్ల దృష్టిని బాగా ఆక‌ర్షిస్తోంది. పెయిడ్ ప్ర‌మోష‌న్ లేకుండా అక్క‌డ‌ ఇలా మ‌న పాట ప్లే చేస్తున్నారంటే విశేష‌మే.

ప‌లాస అనే చిన్న సినిమా జ‌నాల దృష్టిలో ప‌డింద‌న్నా.. ఆ సినిమా మంచి ఫ‌లితాన్నందుకుంద‌న్నా న‌క్కిలీసు గొలుసు పాటే  ముఖ్య కార‌ణం. శ్రీకాకుళం జాన‌ప‌దాల్లో పాపుల‌ర్ పాట‌ను తీసుకుని సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచే ఈ పాట‌ను కంపోజ్ చేయ‌గా.. ఆయ‌న‌తో క‌లిసి తేజ‌స్విని ఈ పాట‌ను పాడింది. ప‌లాస సినిమాలో ర‌ఘు విల‌న్ పాత్ర కూడా పోషించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. 

దుర్గారావు అనే ఒకాయ‌న త‌న‌దైన శైలిలో ఈ పాట‌కు స్టెప్పులేసి దీన్ని మ‌రింత పాపుల‌ర్ చేశాడు. టిక్ టాక్ వీడియోలు, డ్యాన్స్ ప్రోగ్రాముల ద్వారా ఈ పాట‌కు విప‌రీత‌మైన పాపుల‌రాటీ వ‌చ్చి క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంది. ఐతే ప‌లాస విడుద‌లై చాలా ఏళ్లు గ‌డిచిపోయాక, ఈ పాట‌ను జ‌నం మ‌రిచిపోయిన టైంలో ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో న‌క్కిలీసు గొలుసు ప్లే కావ‌డం ఆశ్చ‌ర్యం.