మాస్ రాజా రవితేజ ఏడాది విరామం తర్వాత మళ్లీ బాక్సాఫీస్ సందడికి సిద్ధమయ్యాడు. ఆయన కొత్త చిత్రం ‘క్రాక్’ శనివారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత ఏడాది జనవరిలోనే విడుదలైన ఆయన సినిమా ‘డిస్కో రాజా’ దారుణమైన ఫలితాన్నందుకుంది. మాస్ రాజా కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచింది. దీని కంటే ముందు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘టచ్ చేసి చూడు’ సైతం డిజాస్టర్లే అయ్యాయి.
ఐతే వాటి ప్రభావం ‘క్రాక్’ మీద పెద్దగా పడలేదనే చెప్పాలి. ఈ సినిమాకు ముందు నుంచి క్రేజ్ బాగానే ఉంది. విడుదల దగ్గర పడేసరికి అది ఇంకాస్త పెరిగింది. మాస్‌ను ఆకర్షించే టీజర్, ట్రైలర్, పాటలు ఈ క్రేజ్‌కు కారణం. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది.
‘క్రాక్’ థియేట్రికల్ హక్కుల విలువ దాదాపు రూ.17 కోట్లు. కొన్ని ఏరియాల్లో సినిమాను సొంతంగా చేస్తున్న నిర్మాత ఠాగూర్ మధు వాటిని మినహాయించి వివిధ ఏరియాలకు హక్కులను అమ్మారు. నైజాం హక్కులు రూ.4.5 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ.3 కోట్లు, ఆంధ్రా ప్రాంతపు హక్కులు రూ.7 కోట్ల దాకా పలికినట్లు సమాచారం. సొంతంగా రిలీజ్ చేస్తున్న ఏరియాలను కూడా కలిపితే తెలుగు రాష్ట్రాల్లో ‘క్రాక్’ రూ.17 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. మామూలు రోజుల్లో అయితే ఇది సింపుల్ టార్గెట్టే కానీ.. ప్రస్తుతం థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తుండటం, కరోనా ప్రభావం కొనసాగుతుండటం వల్ల ప్రేక్షకులు ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లకు అలవాటు పడకపోవడం వల్ల అనుకున్నంత రెవెన్యూ రాదనే భయం ఉంది.
పైగా ‘క్రాక్’ ఏం సాధించినా ఐదు రోజుల్లోనే సాధించాలి. ఆ తర్వాత మూడు సంక్రాంతి సినిమాలతో పోటీపడే వసూళ్లు పంచుకోవడమంటే కష్టం. ఇక ‘క్రాక్’ ఓవరాల్ బిజినెస్ విషయానికి వస్తే.. హిందీ డబ్బింగ్ హక్కులు రూ.11 కోట్లకు అమ్ముడుపోగా.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా ఓటీటీ రూ.7 కోట్లకు కొందట. శాటిలైట్ హక్కులను స్టార్ మా రూ.6 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇలా ‘క్రాక్’ ఓవరాల్ బిజినెస్ రూ.40 కోట్లు దాటినట్లు సమాచారం.