క్రిస్టఫర్ నోలన్ సినిమా వస్తే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేకవుతుందో మరోసారి రుజువైంది. నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ది ఒడిస్సీ’ దెబ్బకు అన్ని సినిమాలూ కొట్టుకుపోయాయి. ముఖ్యంగా ఇండియాలో అయితే దాని ముందు ఏ సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. గత వారాంతంలో విడుదలై బాగా ఆడుతున్న సినిమాలన్నింటినీ ‘ది ఒడిస్సీ’ గట్టి దెబ్బే తీస్తోంది.
హిందీలో అజయ్ దేవగణ్ సినిమా ‘ఢమాల్-4’.. తెలుగులో ‘లెనిన్’.. ఇలా చాలా సినిమాలు మొన్నటి వరకు బాగానే ఆడుతుండగా.. శుక్రవారం నోలన్ సినిమా బాక్సాఫీస్‌ను టేకోవర్ చేసేసింది. దాని ముందు ఈ ప్రాంతీయ భాషా చిత్రమైనా తన ఉనికిని చాటుకోవడం కష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ది ఒడిస్సీ’ ఊపు మామూలుగా లేదు.
ఈ శుక్రవారం టాలీవుడ్ నుంచి అరడజను కొత్త తెలుగు సినిమాలు వచ్చాయి. కానీ వాటిని జనం ఏమాత్రం పట్టించుకోలేదు. ఐశ్వర్యా రాజేష్, తిరువీర్‌ల ‘ఓ సుకుమార్’ ఓ మాదిరిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా, దానికి బ్యాడ్ టాక్ రావడంతో థియేటర్లలో జనం కనిపించడం లేదు. మిగతా చిత్రాలైతే కనీసం ప్రేక్షకుల దృష్టిలో పడట్లేదు. వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్, ఎంఆర్పీ, రాజాదిరాజా.. ఇలా పేరుకేమో చాలా సినిమాలు వచ్చాయి.
కానీ ఇవేవీ కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. నిన్న ఉదయం నుంచి ఏ మల్టీప్లెక్స్ చూసినా.. ‘ది ఒడిస్సీ’ హంగామానే కనిపిస్తోంది. ప్రతి మల్టీప్లెక్స్‌లోనూ సగానికి పైగా షోలు ఆ సినిమాకే ఇచ్చేశారు. అన్ని షోలకూ ఫుల్స్ పడుతున్న పరిస్థితి. కానీ పక్కన తెలుగు సినిమాలకు మాత్రం మినిమం ఆక్యుపెన్సీలు లేవు. కొత్త చిత్రాలతో పోలిస్తే.. ముందు వారం వచ్చిన ‘లెనిన్’ పరిస్థితే కొంచెం మెరుగు. ఈ వారం వచ్చిన చిత్రాలన్నీ నోలన్ దెబ్బకు వాషౌట్ అయిపోయినట్లే కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates