‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన వాళ్లకు.. కమర్షియల్ చిత్రాలకు ఆమె సూట్ అవ్వదనే అభిప్రాయం కలిగింది. కానీ ఆ తర్వాత నటనతో మెప్పిస్తూనే గ్లామర్ టచ్ ఉన్న పాత్రలు కూడా చేసి ఆకట్టుకుంది రుక్మిణి. ముఖ్యంగా ‘కాంతార: చాప్టర్-1’తో తనకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు.
దీంతో ‘డ్రాగన్’ లాంటి భారీ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా అవకాశాన్నందుకుంది. ఈ సినిమాతో తన రేంజే మారిపోతుందని భావిస్తుండగా.. అది రిలీజ్ కాకముందే మరో మెగా మూవీలో రుక్మిణి ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘ధర్మన్’లో ఆమె ఓ కీలక పాత్ర చేయనుందట.
ఓ మై కడవులే, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రాలతో మెప్పించిన అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజినీ ‘ధర్మన్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే ఈ చిత్రంలో సిమ్రన్.. సూపర్ స్టార్‌కు జోడీగా నటిస్తుండగా, రాశి ఖన్నా ఓ కీలక పాత్ర చేస్తోంది. ఐతే ఇందులో మరో ముఖ్యమైన లేడీ క్యారెక్టర్ ఉందని.. దాని కోసం రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్నారని అంటున్నారు.
సూపర్ స్టార్ సినిమాలో ఇన్ని లేడీ క్యారెక్టర్లు ఉండడం విశేషమే. వివిధ భాషల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న రుక్మిణి.. ‘ధర్మన్’ లాంటి మెగా మూవీలోనూ భాగం కానుండడం విశేషం. ఈ మధ్యే ‘జైలర్-2’ షూట్ పూర్తి చేసిన రజినీ.. ‘ధర్మన్’ సెట్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates